తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి కరోనా సోకింది. కొంచెం నలతగా ఉండటంతో శనివారం సాయంత్రం ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా యాంటీజెన్ రాపిడ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. దీంతో మంత్రి వెంటనే ఐసోలేషన్ లోకి వెళ్లారు. వైద్యులను సంప్రదించి, మందులు తీసుకుంటూ జాగ్రత్త వహిస్తున్నారు. గత మూడు, నాలుగు రోజులుగా తనను కలిసిన వాళ్లంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలు వహిస్తూ వీలైనంత వరకు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని కోరారు.
ఇటీవల దిల్లీ వెళ్లిన మంత్రి
తన ఐసోలేషన్ పూర్తయ్యే వరకు ప్రజలు ఎవరూ తనను కలవడానికి రావద్దని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఇటు హైదరాబాద్ లో, అటు హన్మకొండ, పాలకుర్తి, ఇతర మండల కేంద్రాల్లో అధికారులు, పీఏలు అందుబాటులో ఉంటారని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం.. పండించిన ధాన్యం, బియ్యం కేంద్రం కొనుగోలు చేయడంపై రాత పూర్వక హామీ కోసం గత నాలుగు, ఐదు రోజులుగా దిల్లీలో పడిగాపులు కాసిన నేపథ్యంలో తనకు కరోనా వచ్చిందని మంత్రి అన్నారు. ఇప్పటికైనా కేంద్రం రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.
Also Read: న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు... తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణలో మరో 3 ఒమిక్రాన్ కేసులు
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటలలో తెలంగాణలో కొత్తగా మరో 3 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 41కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 333 మంది శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వారందరికీ కోవిడ్ ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేయగా ఎనిమిది మంది కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు అధికారులు.
Also Read: తెలంగాణలో మరో 3 ఒమిక్రాన్ కేసులు....ఏపీలో కొత్తగా 104 కరోనా కేసులు, టీఎస్ లో 140
కరోనా కేసులు
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 26,947 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరిలో కొత్తగా 140 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,80,553కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 4,021కు చేరింది. కరోనా నుంచి నిన్న 186 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 3,499 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: కర్ణాటకలో కరోనా కలకలం... 33 మంది వైద్య విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్