ఏపీ, తెలంగాణ నడుమ జలజగడం నడుస్తూనే ఉంది. నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించింది కృష్ణానది యాజమాన్య బోర్డు బృందం.. త్వరలోనే ఎన్జీటీ, కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. అయినా మరోవైపు లేఖలు, ఫిర్యాదులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాశారు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్‌.


కృష్ణా జలాల కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే అడ్డుకోవాలని కృష్ణా బోర్డుకు రాసిన లేఖలో తెలంగాణ కోరింది. మచ్చుమర్రి ఎత్తిపోతల, మల్యాల పంపింగ్ స్టేషన్, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి ఏపీ నీటి తరలింపును ఆపాల్సిందిగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డుని తెలంగాణ ప్రభుత్వం అడిగింది. సరైన కేటాయింపులు లేకుండా శ్రీశైలం ప్రాజెక్ట్ ముందు భాగం నుంచి.. అక్రమంగా కేసీ కెనాల్‌కు ఆంధ్రప్రదేశ్ నీటిని మళ్లించకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది.


అనుమతి లేని ప్రాజెక్టుల ద్వారా తరలింపును అడ్డుకోవాలని ఈఎన్‌సీ మురళీధర్ కేఆర్ఎంబీకి తెలిపారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి తరలింపు ఆపాలని ఆయన లేఖలో కోరారు. మాల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి నీటి తరలింపు ఆపాలన్నారు. బనకచర్ల రెగ్యులేటర్ నుంచి నీటి తరలింపు వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


సుంకేశుల ఆనకట్ట కేసీ కాల్వకు 39.90 టీఎంసీల కేటాయింపులు ఉండగా ప్రతి ఏటా సగటున 54 టీఎంసీల తుంగభద్ర జలాలను తరలిస్తున్నారని... దీంతో ఆర్డీఎస్​కు 15.90 టీఎంసీల కేటాయింపులు ఉండగా... సగటున ఐదు టీఎంసీలకు మించి తరలించడం సాధ్యం కావడం లేదని లేఖలో పేర్కొన్నారు.


శ్రీశైలం జలాశయం నుంచి కేసీకాల్వకు నీటిని తరలించడం అక్రమమని ఈఎన్సీ లేఖలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల్లో శ్రీశైలం నుంచి 39 టీఎంసీలను మాత్రమే తరలించాలన్నారు. కానీ కేటాయింపులు లేని అక్రమ ఎత్తిపోతల పథకాల ద్వారా పరిమితికి మించి నీటిని తరలిస్తోందని చెప్పారు. శ్రీశైలం జలాశయం కనీస నీటివినియోగ మట్టానికి దిగువన 798 అడుగుల నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తున్నారన్నారు.  ఈ కారణంగా తెలంగాణ ప్రాజెక్టులకు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇబ్బంది కలుగుతోందని మురళీధర్ అన్నారు. బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ద్వారా, హంద్రీనీవా ఎత్తిపోతలకు సంబంధించిన మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి కూడా కేసీ కాల్వను కృష్ణా జలాలను తరలిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.


 


Also Read: Andhra Pradesh: జగన్ పాలనపై ప్రజల్లో అనుమానాలు.. కోట్ల రూపాయలు ఎటు వెళ్తున్నాయ్‌: నాదేండ్ల


    Raithanna Movie: ఇక దేశంలో మిగిలేది రైతు కూలీలే.. వ్యవసాయ చట్టాలపై నారాయణ మూర్తి సీరియస్ కామెంట్స్..