తెలంగాణలో మరో ఉపఎన్నిక వచ్చే అవకాశం కనిపిస్తోంది. వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పౌరసత్వ వివాదపై విచారణ హైకోర్టు ఉపఎన్నికకు సిద్ధం కండి అని వ్యాఖ్యానించడంతో రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి ప్రారంభమయింది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌పై చాలా కాలంగా పౌరసత్వ వివాదం ఉంది. ఆయన ఇప్పటికీ జర్మనీ పౌరుడేనని కేంద్రం హైకోర్టులో అఫిడవిట్ కూడా వేసింది. రేపోమాపో తీర్పు రాక తప్పదని.. అంచనా వేస్తున్నారు. ఆయనపై అనర్హతా వేటు వేయక తప్పదన్న అంచనాలు ఉన్నాయి. తదుపరి విచారణను ఆగస్టు 24వ తేదీకి వాయిదా పడింది. ఇప్పటికీ ఆయన జర్మనీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడనే ఆధారాలు హైకోర్టుకు సమర్పించాయి. ఈ కారణంగా రేపోమాపో తీర్పు వస్తే వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ శాసనసభ్యత్వంపై అనర్హతా వేటు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
చెన్నమనేని రమేష్ వేములవాడ నుంచి సుదీర్ఘంగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొదట టీడీపీ నుంచి గెలిచారు. తర్వాత టీఆర్ఎస్‌లో చేరి.. మళ్లీ గెలుస్తూ వస్తున్నారు. ఆయన వేములవాడలో ఉండేది తక్కువ. కరోనా లాక్ డౌన్ కు ముందు ఆయన జర్మనీలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఇండియాకు వచ్చిన దాఖలాలు లేవు. ఆయన భార్య కూడా జర్మనీ దేశీయురాలే. ఆయనపై వరుసగా పోటీ చేసి ఓడిపోతున్న కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ న్యాయపోరాటం చేస్తున్నారు. గతంలోనే ఓ సారి హైకోర్టు రమేష్‌పై అనర్హతా వేటు వేస్తూ తీర్పు చెప్పింది. అయితే అప్పీల్‌కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. మళ్లీ విచారణ సాగుతోంది.
ఒక వేళ అనర్హతా వేటు పడితే రెండో స్థానంలో ఉన్నతనను ఎమ్మెల్యేగా ప్రకటిస్తారని ఆది శ్రీనివాస్ ఆశిస్తున్నారు. గతంలో ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న కారణంగా అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. టీడీపీ ఎమ్మెల్యేపై వేటు వేసి.. ఆయన స్థానంలో మడకశిర నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా కొనసాగించాలని న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇచ్చాయి.
గతంలో హైకోర్టు ఇచ్చినతీర్పును బట్టి చూస్తే రెండో స్థానంలో ఉన్న తననే ఎమ్మెల్యేగా ప్రకటిస్తారని ఆది శ్రీనివాస్ ఆశిస్తున్నారు. అయితే హైకోర్టు ధర్మాసనం ఉపఎన్నికల గురించి ప్రస్తావించడంతో.. తీర్పు ఎలా ఉండబోతోందన్న ఆసక్తి మాత్రం వ్యక్తమవుతోంది. చెన్నమనేని రమేష్ పౌరసత్వం పై హైకోర్టు జర్మనీ కాన్సులేట్‌కు కూడా నోటీసులు జారీ చేసి వివరాలు సేకరించే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.