దేశంలో... అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ అనేక అవార్డులు సొంతం చేసుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే అనేక కేంద్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకుందన్నారు. తాజాగా గ్రామ పంచాయతీల ఆన్లైన్ ఆడిటింగ్ లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. గత ఏడాది కూడా తెలంగాణ ఆన్లైన్ ఆడిటింగ్ లో నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. అదే ఒరవడిని కొనసాగిస్తూ వరుసగా రెండో సారి కూడా తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖను అభినందిస్తూ లేఖ రాసిందని తెలిపారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రెటరీ సేథీ లేఖ రాశారు. దేశంలో ఆన్లైన్ ఎడిటింగ్ లో తెలంగాణ మిగతా రాష్ట్రాలకు లీడ్ రోల్ పోషిస్తున్నట్లు లేఖలో అభినందించారు.
Also Read: ప్రేమలేఖలు ఇచ్చేందుకో.. ప్రేమించేందుకో.. ఢిల్లీకి రాలేదు
2019-20లోనూ టాప్
కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల వినియోగంపై ఆడిటింగ్ నిర్వహిస్తుంది. 2020-21వ సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగంపై ఆన్లైన్ ఆడిటింగ్ నిర్వహిస్తూ అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జారీ చేసింది. వాటికనుగుణంగా ఆయా రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలు నిధుల ఖర్చును ఆన్లైన్ లోనే అందిస్తున్నది. ఈ విధంగా నిర్ణీత గడువు కంటే ముందే వందకు వంద శాతం ఆన్లైన్ ఎడిటింగ్ పూర్తిచేసిన తెలంగాణ, దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో 72 శాతంతో తమిళనాడు, 60 శాతం తో ఆంధ్ర ప్రదేశ్, 59 శాతంతో కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాలు 25 శాతానికి లోపే ఆన్లైన్ ఎడిటింగ్ పూర్తి చేసి వెనుకబడ్డాయి. కాగా 2019-20 సంవత్సరానికి 14వ ఆర్థిక సంఘం నిధులు వినియోగంపై నిర్వహించిన ఆన్లైన్ ఆడిటింగ్ లో కూడా తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది.
తెలంగాణ గ్రామాలు దేశానికే ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలుస్తున్నాయని దేశానికి ఆదర్శంగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్రం నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికికి బాటలు వేశారన్నారు. చిన్న గ్రామపంచాయతీలకు కూడా కనీసం ఐదు లక్షల రూపాయలు విడుదల చేస్తున్నారన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, డంప్ యార్డ్, స్మశాన వాటిక, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, హరిత హారం కింద మొక్కలు వచ్చాయన్నారు. నిరంతర పారిశుద్ధ్యం కొనసాగుతుండటం వల్ల పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు గా మారాయని అన్నారు. పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, సిబ్బందిని మంత్రి ఎర్రబెల్లి అభినందించారు. ప్రభుత్వం నిర్దేశాలకనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఉద్యోగులు అద్భుతంగా పని చేస్తున్నారన్నారు.
మంత్రి హరీశ్ రావు అభినందన
ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ నిధులను సద్వినియోగం చేసుకుంటూ ఆన్లైన్ ఆడిటింగ్ లో నెంబర్ వన్ గా నిలిచిన గ్రామ పంచాయతీలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని మంత్రి హారీశ్ రావు అభినందించారు. మంత్రి ఎర్రబెల్లి, ఆ శాఖ అధికారులు, ఉద్యోగులను మంత్రి హారీశ్ రావు అభినందించారు.
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి