బీటెక్‌ విద్యార్థి మృతిపై అనుమానం.. కాలేజీ యాజమాన్యంపై తల్లిదండ్రుల ఆరోపణలు 
మేడ్చల్‌ జిల్లా బాచుపల్లిలో వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌ జ్యోతి వసతి గృహం వద్ద విద్యార్థి ఆత్మహత్య సంచలనంగా మారింది. బీటెక్‌ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థి శివనాగు... సూసైడ్‌ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలం కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు పేర్కొన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
అక్కడే అసలు ట్విస్ట్‌ వెలుగు చూసింది. 


వి.ఎన్. ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాల వసతి గృహంపై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు కాలేజ్‌ సిబ్బంది చెప్తున్నారు. ఘటన జరిగిన వెంటనే శివనాగు తల్లిదండ్రులకు గానీ బంధువులకు గానీ సమాచారం ఇవ్వకుండానే మిగతా తంతు కానిచ్చేసింది కళాశాల యాజమాన్యం. దీనిపై శివనాగు ఫ్యామిలీ అనుమానం వ్యక్తం చేస్తోంది. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. కాలేజీలోనే ఏదో జరిగిందని అంటున్నారు. 
సూసైడ్‌నోట్‌లో ఉన్న చేతి రాత శివనాగు హ్యాండ్‌ రైటింగ్ ఒకటి కాదంటున్నారు అతని మేనమామ ప్రకాశ్‌, తండ్రి సత్యనారాయణ. జరిగిన విషయం చెప్పకుండా కళాశాల యాజమాన్యం మబ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. తన బిడ్డ మృతిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని  వాపోతున్నారు.
విషయం తెలుసుకున్న స్టూడెంట్‌ యూనియన్లు, బీజేపీ నేతలు కాలేజీ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. శివనాగు ఫ్యామిలీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలేజీ ప్రధాన  ద్వారం వద్ద ధర్నా చేశారు. అక్కడే ఉన్న పూలకుండీలను ధ్వంసం చేశారు. విద్యార్థులను అడ్డుకున్న బాచుపల్లి పోలీసులు... వారిపై లాఠీ ఛార్జ్‌ చేశారు. 
ఇదంతా చూస్తున్న శివనాగు బంధువులు రోడ్డుపైకి వచ్చారు. తమకు న్యాయం చేయడం లేదని  ఆందోళన బాట పట్టారు. దీంతో వీఎన్‌ఆర్‌ కాలేజీ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కొడుకు చావును తట్టుకోలేక జాతీయ రహదారిపై వాహనాల కిందకు పరుగుతీశారు శివనాగు తల్లి. కాలేజీ యాజమాన్యమే తమ బిడ్డను చంపేసి... బిల్డింగ్‌పై నుంచి పడేశారని ఆరోపించారు. జాతి పేరుతో తనను దూషించి, తక్కువ కులం వాడు ఎక్కువ చదువులు చదవకుండా చంపేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. 
ఈ పరిస్థితుల్లో వీఎన్‌ఆర్‌ కాలేజీ వద్ద భద్రతను పెంచారు పోలీసులు. అక్కడ ధర్నా చేస్తున్న విద్యార్థులను, శివనాగు బంధువులను అక్కడి నుంచి పంపించేశారు. కేసు దర్యాప్తు జరుగుతోందని... నిజంగా శివనాగు హత్యకు గురై ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. 


Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి