కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం వెలువరించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడిన మరుసటి రోజు నుంచే దాని అమలుపై కార్యాచరణ మొదలు పెట్టాల్సిందిగా బోర్డులు లేఖల మీద లేఖలు రాయడం మొదలు పెట్టాయి. ప్రాజెక్టుల వివరాలు, ఇతర అంశాలకు సంబంధించి వివరాలు కోరుతున్నాయి. వీటిపై చర్చించేందుకు వరుస భేటీలు నిర్వహిస్తున్నాయి. బోర్డులు కోరుతున్న ప్రతి సమాచారం సున్నితమైన కీలక అంశాలకు సంబంధించినది కావడంతో, అధికారులు ప్రతి విషయాన్నీ అటు ప్రభుత్వం, ఇటు న్యాయవాదులతో చర్చించి ఖరారు చేయాల్సి వస్తోంది. మరోవైపు కోర్టులు, ట్రైబ్యునల్‌ కేసుల విచారణకు వాదనలు, పార్లమెంటులో ప్రశ్నలకు జవాబులు సిద్ధం చేయాల్సి ఉండటంతో తెలంగాణ నీటిపారుదల శాఖ ఉక్కిరిబిక్కిరవుతోంది.




వరుస లేఖలతో పెరుగుతున్న ఒత్తిడి


జులై 16న గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడిన వెలువడిన మరుసటి రోజే.. అందులో అంశాల అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా బోర్డులు రాష్ట్రాలను కోరాయి. ఆ తర్వాత బోర్డులకు నిధులు విడుదలపై లేఖలు రాశాయి. ఆ వెంటనే రాష్ట్రాల్లో ఆమోదం లేని ప్రాజెక్టుల డీపీఆర్‌లు కోరుతూ లేఖలు రాశాయి. ఆ మరుసటి రోజే సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన సమాచారంతో రెండు లేఖలు, ఆ వెంటనే కమిటీ భేటీని నిర్వహిస్తామంటూ మరో రెండు లేఖలు సంధించాయి.  ఇప్పటికే ఈనెల 3న కమిటీ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ భేటీలో ఏపీ తన అభిప్రాయాన్ని చెప్పగా…తెలంగాణ హాజరుకాలేదు. అయితే గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఒక్కో అంశంపై అభిప్రాయాలను సిద్ధం చేసుకుంటున్న సమయంలో, 9న పూర్తి స్థాయి భేటీ నిర్వహిస్తామని రెండు బోర్డులు తెలంగాణకు లేఖలు రాశాయి.


ఆగస్టు 9న కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిట్‌ పిటిషన్‌ ఉపసంహరణకు సంబంధించి విచారణ జరగనుంది. ఏ కారణాలతో పిటిషన్‌ ఉపసంహరించుకుంటున్నారో తెలంగాణ కోర్టుకు వివరించాల్సి ఉంది. అదే రోజున రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై తెలంగాణ తన వాదనలు వినిపించాల్సి ఉంది. మరోవైపు గెజిట్‌లో పేర్కొన్న అంశాలు, అనుమతుల్లేని ప్రాజెక్టులు, వాటికి రుణాలు, గెజిట్‌తో ఏర్పడే పరిణామాలపై పార్లమెంట్‌లో వరుస ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా అనుమతుల్లేవని చెబుతున్న గోదావరి, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, రూరల్‌ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, నాబార్డ్‌ల రుణాల ప్రశ్నలపై కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ఇరిగేషన్‌ ఇంజనీర్ల నుంచి సమాధానాలు కోరుతోంది. మరోపక్క ప్రాజెక్టుల అనుమతులు, వాటిపై ఖర్చు చేస్తున్న నిధులపై సమాచారం కోరుతూ కుప్పలు కుప్పలుగా ఆర్టీఐ దరఖాస్తులు వస్తున్నాయి. ఇంకోవైపు రుణాలు ఇస్తున్న బ్యాంకులు, ఇతర రుణ సంస్థలన్నీ అనుమతుల్లేని ప్రాజెక్టులు, వీటికి అనుమతుల సాధనలో రాష్ట్రానికి ఉన్న ప్రణాళికపై వరుస లేఖలు రాస్తున్నాయి. దీంతో 4 రోజులుగా ఈ పనుల్లోనే ఉన్న రాష్ట్ర ఇరిగేషన్‌ ఇంజనీర్లు ఓవైపు న్యాయవాదులతో చర్చిస్తూనే మరోవైపు అవసరమైన నివేదికలు సిద్ధం చేసే పనిలో బిజీ బిజీగా ఉన్నారు.