హీరో విశాల్ గురించి మనకందరికీ తెలుసు. ఆయన తండ్రి జీకే రెడ్డి గురించి చాలా కొద్ది మందికే తెలుసు. ఎందుకంటే ఆయన తెర వెనుక హీరో.  సాధారణంగా హీరోలు సిక్స్ ప్యాక్‌లు చేస్తూంటారు. వారు వయసులో ఉంటారు కాబట్టి... అలా చేయవచ్చు. కానీ 83 ఏళ్ల వయసులో సాధ్యమా... నడవడానికే కాస్త కష్టపడే వయసు అది. అలాంటిది.. కండలు పెంచడం సాధ్యమా అంటే.. అవునని నిరూపించారు విశాల్ తండ్రి జీకే రెడ్డి. ఆయన ఫిట్‌నెస్ ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్ అవుతోంది.  
 
ఇటీవల ఫిట్ ఇండియా అంబాసిడర్లలో ఒకరిగా నియమితులైన జీకే రెడ్డి... దేశంలోని యువతలో ఓ ప్రత్యేకమైన అవగాహన పెంచాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం వినూత్న మార్గాన్ని అన్వేషించారు. అదేమింటే.. యువత ఎవరైనా సరే జిమ్ చేసి.. ఆ వీడియో పంపితే డబ్బులు ఇవ్వాలని అనుకోవడం. ఈ కాన్సెప్ట్‌కి చాలెంజ్ అండ్ ఎర్న్ అని పేరు పెట్టారు. జిమ్ చేసి.. వీడియో తీసి.. ఇతరులకు జిమ్ చేయమని రిఫర్ చేస్తే చాలు.. ఒక్కో రిఫరెన్స్‌కు రూ. 75 ఇస్తామని జీకే రెడ్డి ప్రకటించారు. ఆ వీడియోను జీకే రెడ్డి సోషల్ మీడియాలో సూచించిన వాట్సాప్ పోస్టుకు పంపితే చాలు. ఆగస్టు 25 వరకు మాత్రమే ఈ ఛాన్స్ ఉంది. 2021 ఆగస్టు 29 వ తేదీన ఎవరెవరు ఇందులో అత్యధికంగా రిఫర్ చేశారో ప్రకటిస్తారు. 


జీకే రెడ్డికి ఇప్పుడు 83 ఏళ్లు. ఈవయసులోనూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే తన ఆరోగ్యానికి కారణమని ఆయన చెబుతూ ఉంటారు.  ఆయన ఒకప్పుడు సినీ నిర్మాత. గ్రానైట్ వ్యాపారి. కానీ ఫిట్ నెస్ మీద ప్రత్యేక శ్రద్ధ ఉంది. ఫిట్ నెస్ బిజినెస్‌లోకి కూడా ఎంటరయ్యారు. తన పేరుతోనే జిమ్ సెంటర్ నడుపుతున్న జీకే రెడ్డి వచ్చిన వారికి వ్యాయామంలో మెళకువలు నేర్పిస్తుంటారు. ఆయన చేసిన కొన్ని వ్యాయామాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. గత ఏడాది కరోనా బారిన పడినా ఆయన చాలా వేగంగా కోరుకున్నారు. 


జీకే రెడ్డి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ వయసులోనూ ఇంత ఫిట్‌గా ఉండటం ఓ అద్భుతం అయితే.. అంతకు మించి యువను ఫిట్ నెస్ వైపు మరల్చడానికి డబ్బులు ఖర్చు పెట్టాలనుకోవడం.. ఆయన ఆరోగ్యస్పృహకి నిదర్శనమని అంటున్నారు. జీకే రెడ్డి తెలుగువారే. కానీ ఆయన చెన్నైలో స్థిరపడ్డారు. చిత్ర నిర్మాతగా దక్షిణాది అంతా పరిచయమే. కానీ ఆయన ఎన్ని సినిమాలు తీసినా రాని గుర్తింపు... లేటు వయసులో ఫిట్‌నెస్ స్టార్‌గా ట్రెండ్ అవుతున్నారు.