Telangana Highcourt Notices to Danam Nagendar And Brs Mlas: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagendar) కు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) నోటీసులు జారీ చేసింది. దానం ఎన్నిక రద్దు చేయాలంటూ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో దానం ఓటర్లను ప్రలోభపెట్టారని.. డబ్బులు పంచడంతో పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాగే, ఆయన సతీమణి పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదని చెప్పారు. ఈ వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది.


పలువురు ఎమ్మెల్యేలకూ నోటీసులు


కాగా, దానంతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోవాలక్ష్మి, మాగంటి గోపీనాథ్, కూనంనేని సాంబశివరావు, మధుసూదన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. వీరంతా ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్స్ సమర్పించారని హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలయ్యాయి.


కాంగ్రెస్ గూటికి..


ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తాజాగా, ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 1994, 1999, 2004లో ఆసిఫ్‌నగర్‌ నుంచి విజయం సాధించిన దానం.. 2009, 2018లో మాత్రం ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో హస్తం గూటికి చేరారు. దీంతో దానం నాగేందర్ పై బీఆర్ఎస్ నేతలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆయనపై అనర్హత పిటిషన్ వేయాలని వారు స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. 


అటు, దానం నాగేందర్ ను హస్తం పార్టీ సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి బరిలో దింపింది. గురువారం విడుదలైన మూడో జాబితాలో కాంగ్రెస్ అధిష్టానం ఆయన పేరును ఖరారు చేసింది. సికింద్రాబాద్ స్థానాన్ని ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో హస్తం పెద్దలు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే దానంను ఎన్నికల బరిలో నిలిపారు. అటు, బీజేపీ తరఫున ఈ స్థానం నుంచి కిషన్ రెడ్డి పోటీ చేయనున్నారు. 


Also Read: MandaKrishna: 'కడియం శ్రీహరి వల్లే రాజయ్య బర్తరఫ్' - మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు