Pocso Case Filed on Bhupalapally CI: భూపాలపల్లి (Bhupalapally) జిల్లాలో సీఐగా విధులు నిర్వహిస్తున్న బండారి సంపత్ పై కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో పొక్సో కేసు నమోదైంది. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో గతంలో ఎస్సైగా పని చేసి ప్రస్తుతం సీఐగా భూపాలపల్లి జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారి సంపత్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు కాకతీయ యూనివర్సిటీ సీఐ సంజీవ్ తెలిపారు. 2022లో కేయూలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో సంపత్ స్టేషన్ పరిధిలో ఓ మహిళతో సన్నిహిత సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయంపై మహిళ భర్త పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా ఏఆర్ కు అటాచ్ చేశారు. అనంతరం సీఐగా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లా, అక్కడి నుంచి భూపాలపల్లి జిల్లాకు బదిలీ అయ్యి విధులు నిర్వహిస్తున్నారు.


మహిళ ఫిర్యాదుతో..


ప్రస్తుతం సీఐ సంపత్ సదరు మహిళతోనే సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మహిళ కూతురిపై కన్నేసిన పోలీస్ అధికారి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఇటీవల కేయూ పీఎస్ లో ఆ మహిళ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై విచారించిన  కేయూ పోలీసులు సీఐపై అత్యాచార యత్నం, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సదరు అధికారి తమ కస్టడీలో ఉన్నట్లు కేయూ సీఐ తెలిపారు.


Also Read: BRS MP Candidates: బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులుగా మాజీ అధికారులు- ఇద్దరితో జాబితా విడుదల