Telangana Hogh Court: బీఆర్ఎస్ ఎంపీ, హెటిరో ఛైర్మన్ పార్థసారధి రెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్ కు భూ కేటాయింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఈ పౌండేషన్ కు మేనేజింగ్ ట్రస్టీగా పార్థసాథి రెడ్డి ఉన్నారు. అయితే 2018 సంవత్సరంలో హైదరాబాద్ లోని ఖానామెట్ వద్ద క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం కోసం 15 ఎకరాల భూమిని ఆ ఫౌండేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందుకు సంబంధించిన జీఓను సవాల్‌ చేస్తూ... 2019లో హైకోర్టులో కొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రైట్ సొసైటీతో పాటు ఊర్మిళ, సురేష్ కుమార్... ఎంపీ పార్థ సారధికి భూమిని కేటాయించడంపై తమకు అభ్యంతరం ఉందంటూ పిల్ వేశారు.


దీనిపై విచారణ చేపట్టిన సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం.. భూ కేటాయింపును రద్దు చేస్తూ తీర్పు వెలువరిచింది. భూ కేటాయింపుపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను ధర్మాసనం కొట్టివేసింది. భూ కేటాయింపుల విధానానికి అనుగుణంగా దీనిపై పునః పరిశీలను చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.