ప్రకాశం జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం వివాదం అధికార ప్రతిపక్షం మధ్య అగ్గి రాజేసింది. టీడీపీ, వైసీపీ నేతల పోటాపోటీ కార్యక్రమాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నాయుడుపాలెంలో ఉప్పునిప్పులా మారింది పరిస్థితి. 


టీడీపీ కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ నేతుల ఆరోపణలు చేశారు. దీనిపై మండిపడ్డ టీడీపీ నేతలు ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య మాట యుద్ధం నడిచింది. 


టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి కొండపి వైసీపీ ఇన్‌ఛార్జ్‌ అశోక్‌బాబు యత్నించారు. ఆయనతోపాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు నాయుడుపాలెంలోని స్వామి ఇంటికి బయల్దేరి వెళ్లారు. మార్గ మధ్యలోనే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దానికి పోటీగా టీడీపీ లీడర్లు ఆందోళనలు చేపట్టారు. 


ఓవైపు వైసీపీ చర్యకు ప్రతిగానే టీడీపీ ప్రతిచర్యకు దిగడంతో నాయుడుపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనంతటికీ ఎమ్మెల్యే కారణమని చెప్పిన పోలీసులు వీరాంజనేయ స్వామి అరెస్టు చేశారు.