ఎన్నికల సంఘం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు తెలిపింది. హుజూరాబాద్‌లో దళితబంధు నిలిపివేతకు సంబంధించి సీఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలైంది. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం గురువారం తుది తీర్పు ఇచ్చింది. నిష్పక్షపాత ఎన్నికలకు నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి ఉందని హైకోర్టు పేర్కొంది. మల్లేపల్లి లక్ష్మయ్య, జడ్సన్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఉప ఎన్నిక ముగిసే వరకు హుజూరాబాద్‌లో దళితబంధు పథకం నిలిపేయాలని ఈ నెల 18న ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.
గత వాదనల్లో
కేంద్ర ప్రభుత్వం మహిళా పోషణ్ అభియాన్ అమలుకు అంగీకరించిన విధంగానే దళిత బంధు పథకాన్ని కూడా కొనసాగించాలని గత వాదనల్లో పిటిషనర్లు కోర్టును కోరారు. దళిత బంధు పథకాన్ని ఆపడంతో వెనుకబడిన వర్గాల వారికి నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు పథకాన్ని ఎన్నికల సంఘం ఆపడం సరైన నిర్ణయం కాదన్నారు. వెంటనే దళిత బంధు పథకాన్ని అమలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
Also Read: డబ్బులు ఇచ్చేదాకా కొట్లాడతా.. కేసీఆర్‌ను వదిలే ప్రసక్తే లేదు: ఈటల రాజేందర్
దళిత బంధుకు తాత్కాలిక బ్రేక్
హుజూరాబాద్ ఉప ఎన్నికల కారణంగా దళితబంధు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం గతంలో ఆదేశాలు జారీచేసింది. దీంతో దళితబంధు అమలుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఉపఎన్నిక దృష్ట్యా దళిత బంధు పథకాన్ని ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఉపఎన్నిక నేపథ్యంలో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో వెంటనే దళిత బంధును నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమలులో ఓటర్లు ప్రలోభానికి లోనుకాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఉపఎన్నిక తర్వాత దళితబంధును యథావిథిగా కొనసాగించవచ్చని సూచించింది. ఎన్నికల సంఘం నిర్ణయంపై టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేతల లేఖల కారణంగానే దళిత బంధు నిలిచిపోయిందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. టీఆర్ఎస్ నేతలే లేఖలు రాసి ఎన్నికల డ్రామా ఆడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.
Also Read: దళిత బంధు అమలుపై ముగిసిన వాదనలు.... తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి