దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ కోసం మాత్రమే తీసుకొచ్చింది కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 1986లోనే ఈ పథకానికి మొదటి అడుగుపడిందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. దళితబంధుపై మంగళవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దళితుల పరిస్థితి దయనీయంగా ఉందని పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా దళితుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని కేసీఆర్ తెలిపారు. అవకాశాలు లేక దళితులు సతమతమవుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. 


Also Read: దళిత బంధు అమలు కోసం విధివిధానాలు జారీ... రూ. 10 లక్షలతో రెండు యూనిట్లు ఏర్పాటుకు అనుమతి.. లబ్దిదారులకు అనుభవజ్ఞులతో శిక్షణ






నగదు ఖర్చుపై నిబంధనలు లేవు


దళిత బంధు చర్చపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ను ఇందిరా గాంధీ హయంలో ఏర్పాటుచేసినా.. ఆర్థిక సాయం పొంది బాగుపడిన వారు కనిపించలేదన్నారు. వచ్చే ఏడాది మార్చి లోపు  రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ పథకం అమలుకు ఇప్పుడు దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. రూ.10 లక్షలతో ఎక్కడైనా, ఎన్ని వ్యాపారాలైనా లబ్దిదారులు పెట్టుకోవచ్చని తెలిపారు. ఈ నగదుతో పలానా పనిచేయాలని ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు పెట్టదని తెలిపారు. లబ్ధిదారులు యూనిట్లగా ఏర్పడి పెద్ద పరిశ్రమను సైతం పెట్టుకోవచ్చన్నారు. వచ్చే బడ్జెట్‌లో దళితుల అభ్యున్నతికి రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఆ నిధులతో నియోజకవర్గానికి 2 వేల మందికి దళిత బంధు అందజేస్తామన్నారు. దళితుల కోసం రక్షణ నిధి కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో సగటున 17.53 శాతం ఎస్సీల జనాభా ఉందని కేసీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్‌ పెంచాలని కేసీఆర్ అన్నారు. కుల గణన జనాభా లెక్కలు జరగాలని సీఎం అన్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం తరఫున తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. 


Also Read: Dalitha Bandhu: దళిత బంధు విషయంలో అదే జరిగితే యాదాద్రిలో ఆత్మహత్య చేసుకుంటా: మోత్కుపల్లి


తెలంగాణ రావడానికి అంబేడ్కర్ కూడా కారణం


రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం పార్లమెంట్‌కు ఉండాలని అంబేడ్కర్‌ చెప్పారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రావడానికి అంబేడ్కర్ కూడా ఒక కారణమని కేసీఆర్ అన్నారు. అణచివేతకు గురైన వర్గాలకు ఇప్పటికీ సాధికారత చేకూరలేదన్నారు. దేశాన్ని ఒక్క కాంగ్రెస్‌ పార్టీయే పాలించలేదన్న ఆయన.. రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయని గుర్తుచేశారు. మేం పొలాలు పంచామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెబుతున్నారన్న సీఎం... 75 లక్షల మంది దళితులుంటే 13 లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉందని గుర్తుచేశారు. పాలమూరు లాంటి జిల్లా నుంచి లక్ష మంది వలస వెళ్లారన్నారు. 


2,3 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభం


నిరుద్యోగులకు సీఎం కేసీఆర్​శుభవార్త చెప్పారు. 2, 3 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభంకానుందని అసెంబ్లీలో తెలిపారు. దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు నిర్వహిస్తామన్నారు. జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ఉంటుందని తెలిపారు. దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశముందని సీఎం కేసీఆర్​వెల్లడించారు. 


Also Read: దళిత బంధు అమలు కోసం విధివిధానాలు జారీ... రూ. 10 లక్షలతో రెండు యూనిట్లు ఏర్పాటుకు అనుమతి.. లబ్దిదారులకు అనుభవజ్ఞులతో శిక్షణ


దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పలేదు 


దళితులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పనేలేదని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అన్నారు. ప్రతి ఎస్సీ కుటుంబానికి కనీసం 3 ఎకరాలు ఉండాలని చెప్పానన్నారు. దళితులకు ఎకరం ఉంటే 2 ఎకరాలు కొనిస్తామని చెప్పానన్నారు. ఒకటిన్నర ఎకరం ఉంటే మరో ఒకటిన్నర ఇస్తామన్నారు. ఎన్నికల అజెండాలోనూ అదే చెప్పామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.


Also Read: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో 4 మండలాల్లో దళిత బంధు అమలు 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి