సాఫ్ట్‌వేర్‌ ఎగుమతిదారు విప్రో స్థాపకులు అజీమ్‌ ప్రేమ్‌జీ మరోసారి దాతృత్వం చాటుకున్నారు. ఎదుటివారు చేయి సాచకుండానే కోట్లాది రూపాయాలను దానం చేస్తున్నారు. భారత దానకర్ణుల జాబితాలో మళ్లీ అగ్రస్థానం దక్కించుకున్నారు. 2021 ఆర్థిక ఏడాదిలో ఆయన రోజుకు రూ.27 కోట్లు మొత్తంగా రూ.9,713 కోట్లు విరాళం ఇచ్చారు.


కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో ప్రేమ్‌జీ అదనంగా నాలుగో వంతు డొనేషన్లు పెంచారని ఎడిల్‌గివ్‌ హురూన్‌ ఇండియా ఫిలాంత్రపీ లిస్ట్‌-2021 తెలిపింది. ఇక హెచ్‌సీఎల్‌ కంపెనీ అధినేత శివనాడార్‌ రూ.1263 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. అపర కుబేరుడిగా పేరు తెచ్చుకున్న ముకేశ్‌ అంబానీ రూ.577 కోట్లు విరాళంగా ఇచ్చి మూడో స్థానంలో ఉన్నారు. రూ.377 కోట్లతో కుమార్‌ మంగళం బిర్లా నాలుగో స్థానం సంపాదించారు. దేశంలో రెండో సంపన్న పరుడు గౌతమ్‌ అదానీ రూ.130 కోట్లు విపత్తుల నిర్వహణకు అందించి ఎనిమిదో ర్యాంకు అందుకున్నారు.


ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని తన ర్యాంకును మరింత మెరుగు పర్చుకున్నారు. రూ.183 కోట్లు దానం చేసి ఐదో స్థానంలో నిలిచారు. ఆయన ఎక్కువగా విద్య, ఆరోగ్య రంగాల్లో కృషి చేస్తున్నారు. పదేళ్ల కాలంలో పౌర సమాజాభివృద్ధి కోసం ఎక్కువగా దానం చేస్తామని ఆయన విజన్‌ పెట్టుకున్నారు. ఇక దానం చేస్తున్న వారి వయస్సు 40 ఏళ్లలోపునకు చేరుకుందని హురున్‌ ఇండియా ఎండీ అనాస్‌ రెహ్మాన్‌ అన్నారు.


జాబితాలోకి కొత్తగా ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా చేరారు. ఆయన తన వార్షిక సంపాదనలో నాలుగో వంతు లేదా రూ.50 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మధ్యే ఆయన నరేంద్ర మోదీని కలిశాక అశోక యూనివర్సిటీకి మద్దతుగా మాట్లాడారు. ఇక నితిన్‌, నిఖిల్‌ కామత్‌ సోదరులు రాబోయే కొన్ని సంవత్సరాల్లో రూ.750 ఖర్చు చేస్తామని అన్నారు. వాతావరణ మార్పుల పరిష్కారాల కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. వారు ప్రస్తుత జాబితాలో 35వ స్థానంలో ఉన్నారు.


ఎల్‌ అండ్‌ టీ మాజీ ఛైర్మన్‌ ఏఎం నాయక్‌ రూ.112 కోట్లతో జాబితాలో 11వ స్థానం దక్కించుకున్నారు. టాప్‌-10 జాబితాలో హిందూజా, బజాజ్‌, అనిల్‌ అగర్వాల్‌, బర్మన్‌ కుటుంబాలు ఉన్నాయి. మహిళల జాబితాలో రోహిణి నీలేకని (రూ.69 కోట్లు), లీనా గాంధీ తివారీ (రూ.24 కోట్లు), అను ఆగా (రూ.20 కోట్లు) వరుసగా ఉన్నారు.


ఇక నగరాల్లో ముంబయి 31%, దిల్లీ 17%, బెంగళూరు 10 శాతంతో ఉన్నాయి. ఫార్మా ఇండస్ట్రీ నుంచి ఎక్కువ డొనేషన్లు లభిస్తుండగా ఆటో మొబైల్‌, ఆటో కాంపోనెంట్స్‌, సాఫ్ట్‌వేర్‌ సర్వీసుల తర్వాతి స్థానాల్లో నిలిచాయి.


Also Read: Diwali Gift: దీపావళికి బహుమతి పొందారా.. ఆఫీస్‌లో బోనస్ ఇచ్చారా.. మరి పన్ను కట్టాలని తెలుసా?


Also Read: Low Home loan interest: పోతే దొరకని ఆఫర్‌! అతి తక్కువ వడ్డీరేటుకే ఈ బ్యాంకులో హోమ్‌లోన్‌.. వివరాలు ఇవే!


Also Read: Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!


Also Read: Pradhan Mantri Garib Kalyan Package: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో 6 నెలలపాటు పాలసీ కొనసాగిస్తూ కీలక నిర్ణయం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి