ఏపీలో గంజాయి మూలాలు విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులే స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ నుంచి తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలకు చేరుతుందని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇటీవల తెలంగాణకు చెందిన ఓ ఎస్పీ కామెంట్స్ కూడా చేశారు. దీంతో తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ తనిఖీలు కట్టుదిట్టం చేసింది. కొంత మంది కేటుగాళ్లు గంజాయి రవాణా కోసం తిరుపతి రూట్ ని ఎంచుకుంటున్నారు. ఇటీవల తిరుపతి వెళ్లే బస్సుల్లో వరుసగా గంజాయి పట్టుబడటంతో పోలీసులు నిఘా పెంచారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో గంజాయి తరలిస్తున్న ఓ ముఠాను నెల్లూరు జిల్లా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. 


ఆర్టీసీ బస్సులో గంజాయి తరలింపు


నెల్లూరు జిల్లా గూడూరు పరిధిలోని చిల్లకూరు సమీపంలో బూదనం టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీల్లో గంజాయి గుట్టురట్టు అయింది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో తెలిపిన వివరాలు ప్రకారం.. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తోన్న ఆర్టీసీ బస్సులో అన్నదమ్ములిద్దరు 18 కేజీల గంజాయి తరలిస్తున్నారు. వీరు ఏపీ నుంచి తమిళనాడుకు గంజాయి తరలిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా ఎరివలవు గ్రామానికి చెందిన రవి, సహదేవ్ అనే ఇద్దరు అన్నదమ్ములు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి వద్ద గంజాయిని కొనుగోలు చేశారు. కేజీ రూ.4 వేలకు కొనుగోలు చేశామని, తమిళనాడులో కేజీ రూ.8 వేలకు అమ్ముతామని వారిద్దరూ చెబుతున్నారు. అన్నదమ్ములను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. 




Also Read:  హైదరాబాద్‌లో యువకుడు ఘాతుకం.. యువతి చేతులు, గొంతు కోసి దాడి


తిరుపతి కేంద్రంగా రవాణా


నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తున్న మరో 32 కేజీల గంజాయి ప్యాకెట్లను సెబ్ అధికారులు పట్టుకున్నారు. తిరుపతి రూట్ లో వెళ్తోన్న బస్సుల్లో గంజాయి స్మగ్లర్లు ఎంచుకుంటున్నారు. మచిలీపట్నం నుంచి తిరుపతి వెళ్తోన్న ఆర్టీసీ బస్సులో కేరళకు చెందిన ఓ వ్యక్తి వద్ద 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇక రాజమండ్రి నుంచి చిత్తూరు వెళ్లే బస్సులో ఓ మహిళ గంజాయి రవాణా చేస్తుండడంతో పోలీసులు షాకయ్యారు. ఇక్కడ కూడా చిత్తూరు వెళ్లే బస్సులో గంజాయిని పట్టుకున్నారు. జెల్లీ దేవి అనే వివాహిత ఈ గంజాయి ప్యాకెట్లకు ఎస్కార్ట్ గా వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జెల్లీ దేవి నర్సీపట్నానికి చెందిన మహిళగా గుర్తించారు.  తిరుపతి కేంద్రంగా గంజాయి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. తిరుపతి బస్సుల్లో గంజాయి రవాణా చేస్తూ తిరుపతి నుంచి కేరళ, తమిళనాడుకి తరలిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. గంజాయి రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు నిఘా పెంచారు.  


Also Read: లైవ్ వీడియో పెట్టి మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం... సకాలంలో స్పందించి రక్షించిన పోలీసులు


తెలంగాణలో గంజాయిపై స్పెషల్ డ్రైవ్


గత నెల నుంచి తెలంగాణ వ్యాప్తంగా గంజాయిపై స్పెషల్ డ్రైవ్ చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో  గంజాయి సప్లై చేస్తున్న ఇద్దరిని టాస్క్ ఫోర్స్, సివిల్ పోలీసులు అరెస్టు చేశామన్నారు. నిందితులు నరసింగ్ సింగ్, రామవత్ రమేష్ అని తెలిపారు. వీరి నుంచి 70 కిలోల గంజాయితో పాటు ఆటోను సీజ్ చేశామన్నారు. గంజాయి కొనుగోలు అంత గూగుల్ పే ద్వారా చెల్లిస్తున్నట్లు చెప్పారు. 2021లో 114 పీడీ యాక్ట్ లు నమోదు చేశామని, ఇందులో  31 మంది డ్రగ్స్ కేసుల్లో ఉన్నవారని పేర్కొన్నారు.  విశాఖ పట్నంలోని గూడెం కొత్త వీధి దగ్గర నుంచి ఈ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారని టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధకిషన్ రావు తెలిపారు. ప్లాన్ ప్రకారం ఏపీ నుంచి గంజాయిని హైదరాబాద్ కి తరలించారని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని రెహమత్ నగర్ లో ఈ గంజాయి ని ఆటోలో ప్యాక్ చేసి విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 19న గంజాయి, డ్రగ్స్ పై సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. 32 కేసులు నమోదు చేశామని, 26 కేసులు కేవలం గంజాయి ఉన్నాయని వెల్లడించారు. 389 కేజీ గంజాయి స్వాధీనం చేసుకుని, 60 మందిని అరెస్ట్ చేశామన్నారు. 6 మందిపై పీడీ యాక్ట్ లు నమోదు చేశామని డీసీపీ పేర్కొన్నారు.


Also Read: యోగీ మార్క్‌ ట్రీట్‌మెంట్‌..! పాక్‌ విజయానికి వేడుకలు చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి