Haritha Haram: తెలంగాణ ప్రభుత్వం మరో బృహత్తర కార్యాక్రమానికి శ్రీకారం చుట్టింది. అడవుల శాతాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం 9వ విడత కార్యక్రమానికి అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 26న పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా కార్యాచరణ సిద్ధమైంది. ఒక్కరోజులోనే 1.25 కోట్ల మొక్కలు నాటేలా జిల్లాల వారీగా లక్ష్యాన్ని అధికారులు నిర్దేశించారు. 


హైదరాబాద్‌లో 1.3 లక్షలు నాటాల్సి ఉంది. మేడ్చల్‌-మల్కాగిజిరిలో 70 వేలుగా నిర్ధారించారు. నల్గొండ జిల్లాకు అత్యధికంగా 8 లక్షల మొక్కల లక్ష్యాన్ని ఇచ్చారు. ఈ నెల 26న చిలుకూరులోని అర్బన్‌ ఫారెస్ట్‌ ట్రెక్‌ పార్కును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించి అక్కడ మొక్కలు నాటుతారు. ఈ సందర్భంగా అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు అయిదు వేల మొక్కలు నాటేందుకు ఎఫ్‌డీసీ సిద్ధమవుతోంది. 


ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 19.29 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 25 వేల తక్కువగా మొక్కలు నాటనున్నారు. చిలుకూరు రిజర్వు ఫారెస్ట్‌ పరిధి మంచిరేవులలో ఫారెస్ట్‌ ట్రెక్‌ పార్కును ఎఫ్‌డీసీ అభివృద్ధి చేసింది. 100.18 ఎకరాల్లో గుట్టలతో నిండిన అటవీప్రాంతం ఉండగా 60 ఎకరాల మేర సందర్శకుల కోసం అభివృద్ధి చేశారు. 


ఇప్పటికే గ్రామాల వారీగా నర్సరీలను ఏర్పాటు చేసి నాణ్యమైన మొక్కలను ప్రభుత్వం పెంచుతోంది. వాటి సంరక్షణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి రెండు పూటలా నీటిని అందిస్తోంది. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం ప్రణాలికలు వేస్తోంది. ఎప్పటిలాగే పండ్ల మొక్కలు, గృహాల్లో పెంచుకునే మొక్కలు, రోడ్లు, కాల్వలు, చెరువుల పక్కన నాటే మొక్కలు, రైతులు పొలాల్లో నాటుకునేందుకు టేకు, ఎర్రచందనం, వెదురు, సిల్వర్‌ఓక్‌, ఈత, కానుగ, ఫెల్టోఫామ్‌, గుల్‌మొహర్‌, రేల, రెయిన్‌ట్రీ, నిమ్మ, జామ, మునగ, కరివేపాకు మొక్కలు పెంచుతున్నారు.  


2015లో సీఎం చేతుల మీదుగా ప్రారంభం
రాష్ట్రంలో అటవీ శాతాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం హరితహారం ప్రారంభించింది. తెలంగాణలో మొత్తంలో మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. 2015 జూలై 3న చిలుకూరు బాలాజీ దేవాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హరితహారాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇప్పటి వరకూ జరిగిన 8 విడతలు పూర్తయ్యాయి. మొత్తం 273.33 కోట్ల మొక్కలు నాటినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇందుకు ప్రభుత్వం రూ.10,822 కోట్లు ఖర్చు చేసింది. ఎనిమిది విడదలు విజయవంతంగా పూర్తి చేసుకుని 9 విడతకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.


హరితహారం కింద సాధించిన విజయాలు



  • 3.44 లక్షల ఎకరాల అటవీ పునరుద్ధరించారు

  • అడవుల పునరుద్ధరణ ద్వారా పెరిగిన మొక్కలు 53.84 కోట్లు

  • 10,886 కి.మీ. మేర అటవీ ప్రాంతాల చుట్టూ కందకాల తవ్వకం చేపట్టారు

  • అగ్ని ప్రమాదాల నివారణ కోసం 21,452 కి.మీ. మేర ఫైర్‌లైన్లు ఏర్పాటు

  • నేల, తేమ పరిరక్షణకు అడవుల్లో నీటి యాజమాన్య పద్ధతుల అమలు చేశారు.

  • రాష్ట్రవ్యాప్తంగా నగరాలకు సమీపంలో 75,740 ఎకరాల్లో 109 అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు అభివృద్ధి

  • 164 హరిత వనాల్లో వంద శాతం పచ్చదనం. 

  • గ్రేటర్‌ పరిధిలో పదేండ్లలో గ్రీన్‌ కవర్‌ 147 శాతం పెరిగింది.

  • గ్రేటర్‌ పరిధిలో పచ్చదనం పెంపు కోసం సుమారు రూ.700 కేటాయించారు.