Chandrayaan 3 Moon Landing: జాబిల్లిపై తొలి అడుగు వేయడానికి చంద్రాయాన్-3 వడివడిగా అడుగులు వేస్తోంది. చంద్రుడిపై విక్రం ల్యాండర్ దిగి చరిత్ర సృష్టించడానికి కేవలం రెండు రోజులే మిగిలి ఉంది. ఇందులో భాగంగా ఇస్రో జాగ్రత్తగా, పకగ్బందీగా అడుగులు వేస్తోంది. ఆదివారం విక్రమ్ ల్యాండర్ చివరి డీబూస్టింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. సోమవారం ఇస్రో ఫొటోలను విడుదల చేసింది.
ఈ మేరకు చంద్రుడిపై సురక్షిత ల్యాండింగ్ కోసం అణ్వేషణ చేస్తూ, సురక్షిత ప్రాంతాన్ని గుర్తించే క్రమంలో లాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా(LHDAC) తీసిన ఫొటోలను సోమవారం ఉదయం ఇస్రో విడుదల చేసింది. ఈ కెమెరా ద్వారా బండరాళ్లు, లోయలు, కందకాలు లేని ప్రదేశంలో ల్యాండర్ దిగేందుకు ఇస్రో ఈ కెమెరాను అభివృద్ధి చేసింది.
చంద్రునికి 25*134 కిలోమీటర్ల కక్ష్యలో ప్రస్తుతం స్పేస్ క్రాఫ్ట్ తిరుగుతోంది. ఈ పయనం సాఫ్ట్ ల్యాండింగ్‌కు అనువైన మార్గాలను అణ్వేసిస్తుంది. ఈ సందర్భంగా మాడ్యుల్ అంతర్గత తనీఖీలు నిర్వహించుకుంటుందని, నిర్ధేశిత ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ కోసం సూర్యోదయం కోసం వేచి ఉంటుందని ఇస్రో పేర్కొంది. ఆగస్ట్ 23 సాయంత్రం 6:08 గంటలకు విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగు పెట్టనుంది.
చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండింగ్‌పై ఇస్రో మాజీ చీఫ్ కె శివన్ విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రునిపై ఎలాంటి జీవరాశుల కోసం వారు వెతకడం లేదని, చంద్రుని ధ్రువ ప్రాంతం గురించి కొత్త అధ్యయానాలు చేసేందుకు ప్రయోగం దోహదం చేస్తుందని తెలిపారు.
ఆగస్టు 17న వేరుపడ్డ ల్యాండర్ విక్రమ్..
చంద్రయాన్ 3 లో కీలకమైన ల్యాండర్ మాడ్యుల్ విక్రమ్ ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి గురువారం (ఆగస్టు 17) విజయవంతంగా విడిపోయింది. ఈ ల్యాండర్ విక్రమ్ అప్పటినుంచి తనంతతానుగా చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తూ మరింత దిగువ కక్ష్యలోకి వచ్చింది. విడిపోయేటప్పుడు ‘థ్యాంక్స్ ఫర్ ద రైడ్, మేట్’ అని ల్యాండర్ ప్రొపల్షన్ మాడ్యుల్ కి చెప్పినట్లుగా ఇస్రో వెల్లడించింది. చంద్రుడి 153x163 కిలో మీటర్ల కక్ష్యలో సపరేషన్ ప్రక్రియ జరగగా.. తాజాగా ఇస్రో చేసిన డీబూస్టింగ్ ప్రక్రియ అనంతరం 25 కి.మీ x 135 కి.మీ. కక్ష్యలోకి ల్యాండర్ విక్రమ్ చేరుకుని జాబిల్లికి అతి తక్కువ దూరానికి వచ్చింది.
ల్యాండర్ విక్రమ్ వేగం, ఎత్తు ఎలా తగ్గుతుంది?
ల్యాండర్ ఎత్తును, వేగాన్ని తగ్గించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు దాని ఇంజన్లను మండిస్తారు వ్యతిరేక దిశలో మండడం వల్ల ల్యాండర్ కాస్త నెమ్మదిస్తుంది. ఈ క్రమంలో ల్యాండర్ నిర్దేశిత ప్రదేశానికి వచ్చిన తర్వాత జాబిల్లపై సాఫ్ట్ ల్యాండింగ్ దశ ప్రారంభం కానుంది. చంద్రయాన్ 2లో ఇక్కడే ప్రతికూల ఫలితం వచ్చింది. విక్రమ్ ల్యాండర్ చివరి నిమిషంలో సాఫ్ట్ ల్యాండ్ కాలేదు, తరువాత కనెక్షన్ కట్ అయింది.
చంద్రయాన్ 3లోనూ ఇస్రోకు ఇది అత్యంత కష్టతరమైన దశ. చంద్రుడికి 25 నుంచి 30 కి.మీ ఎత్తులో ల్యాండర్ విక్రమ్ స్పీడ్ తగ్గుతూ.. నెమ్మదిగా చంద్రుడి ఉపరితలంపై దిగాలి. చంద్రుడిని తాకే సమయంలో ల్యాండర్ విక్రమ్ వర్టికల్ వెలాసిటీ సెకనుకు 2 మీటర్లు, హారిజాంటల్ వెలాసిటీ సెకనుకు 0.5 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా చేస్తే సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ అవుతుంది.