Telangana Govt increases age limit for Singareni jobs: హైదరాబాద్: సింగరేణిలో కారుణ్య నియామకాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కారుణ్య నియామకాలలో వయో పరిమితిని పెంచుతూ 35 ఏళ్ల నుంచి 45కి పెంచింది. ఈ మేరకు మంగళవారం (జూన్ 11న) తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణిలో ఉద్యోగం చేస్తూ అకాల మరణం చెందిన వారి కుటుంబుం నుంచి ఒకరికి, అనారోగ్యంతో (Medical Unfit) ఉద్యోగ విరమణ చేసిన వారి పిల్లలను బదిలీ కార్మికునిగా కారుణ్య నియామకాలు చేస్తారు. ఇలా ఉద్యోగం పొందే వారి గరిష్ట వయోపరిమితిని పెంచతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ఉత్తర్వులు
గతంలో సింగరేణిలో కారుణ్య నియామకాల 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఉండేది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా సింగరేణి కార్మికుల పరిమితి 35 ఏళ్ల నుంచి 45 కి పెంచింది. ఈ మేరకు సింగరేణి సిఎండి బలరాం నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏజ్ లిమిట్ పెంచాలని సింగరేణి కార్మికుల కుటుంబాలు కొన్నేళ్లుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఏజ్ లిమిట్ పెంచక పోవడంతో తీవ్ర నష్టం జరుగుతోందని, ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్ నేతలకు కార్మికులు తమ కష్టాలు చెప్పుకున్నారు. గత ప్రభుత్వం ఏజ్ లిమిట్ పెంచకపోవడంతో కొందరు బెనిఫిట్స్ కోల్పోయారు.
ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం
కారుణ్య నియామక అభ్యర్థుల వయోపరిమితి పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు కొన్ని రోజుల కిందట హామీ ఇచ్చారు. ఈ ప్రకారం సింగరేణిలో రిక్రూట్ చేసే కారుణ్య నియామకాలలో వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తాజా నిర్ణయంతో 300 నిరుద్యోగులు లబ్ధి పొందనున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక దాదాపు పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా.. ఈ ఏజ్ లిమిట్ ని పెంచకుండా పెండింగ్లో పెట్టింది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సింగరేణి కార్మికుల వయోపరిమితి పెంపుపై సీఎం రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం భట్టిని కలిసి తమ సమస్య వివరించారు. త్వరలోనే కారుణ్య నియామకాల వయోపరిమితిని పెంచుతామని హామీ ఇవ్వగా.. తాజాగా అది అమలులోకి వచ్చింది. ఈ నిర్ణయంతో సింగరేణిలో కారుణ్య నియామకాలలో 45 సంవత్సరాల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే వీలుంది.
Also Read: TGPSC 'గ్రూప్-4' ఫలితాలు విడుదల, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఎంపికైంది వీరే