Pushpa 2 The Rule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప: ది రూల్'. పాన్ ఇండియా వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన 'పుష్ప: ది రైజ్' సినిమాకు రెండో భాగం ఇది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ యాక్షన్ డ్రామా కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు అనుకోకుండా ఈ మూవీ నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. 'పుష్ప 2'ను డిజాస్టర్ చేస్తామంటూ ఓ వర్గం ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.
అల్లు అర్జున్ ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నంద్యాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన పార్టీకి కాకుండా, ఇలా ప్రత్యర్థి పార్టీకి బన్నీ అండగా నిలవడం ఓ వర్గం మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. అంతేకాదు మెగా బ్రదర్ నాగబాబు పెట్టిన ఓ పోస్ట్ పరోక్షంగా బన్నీని టార్గెట్ చేసేలా ఉండటం, ట్రోలింగ్ అవకాశం కల్పించింది.
బన్నీ పతనం మొదలైందంటూ కామెంట్స్
మామూలుగానే మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతోందని చాలా రోజులుగా రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం ఓ వర్గం మెగా ఫ్యాన్స్ కు నచ్చలేదు. అందులోనూ శిల్పా రవి ఎలక్షన్స్ లో ఓడిపోవడంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. నాగబాబును అభిమానించే జబర్దస్త్ కిరాక్ ఆర్పీ లాంటి వారు బాహాటంగానే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, బన్నీ పతనం మొదలైందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మెగా, అల్లు అభిమానుల మధ్య రోజూ ఫ్యాన్ వార్ నడుస్తోంది. ఇకపై అల్లు అర్జున్ సినిమా కార్యక్రమాలకు దూరంగా ఉంటామని, 'పుష్ప 2' చిత్రానికి తమ మద్దతు ఉండదని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. దీంతో వివిధ సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్‌లలో #BoycottPushpa2 ట్రెండ్ అవుతోంది. మెగా ఫ్యామిలీ సపోర్టుతోనే బన్నీ ఈ స్థాయికి ఎదిగారని, మెగాభిమానుల మద్దతులేకపోతే ఎలాంటి ఫలితాలు వస్తాయో చూపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. దీనికి అల్లు ఆర్మీ కూడా ధీటుగా బదులిస్తోంది. 'పుష్ప: ది రూల్' మూవీతో తమ హీరో పాన్ ఇండియాని రూల్ చేస్తాడని అంటున్నారు.
ఫ్రెండ్‌కే మద్దతు.. పార్టీకి కాదు
అయినా బన్నీ తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేస్తే, మొత్తం వైసీపీ పార్టీ కోసం ప్రచారం చేసినట్లుగా మాట్లాడటం సరికాదని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుతూ అల్లు అర్జున్ ట్వీట్ వేయడం, గెలిచిన తర్వాత శుభాకాంక్షలు చెప్పడం వంటి విషయాలను గుర్తు చేస్తున్నారు. కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఏపీలో 'పుష్ప 2' సినిమాని డిజాస్టర్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఈ ఫ్యాన్స్ వార్ కి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.
ఆగస్టు 15న ‘పుష్ప 2’ రిలీజ్
'పుష్ప 2: ది రూల్' సినిమా 2024 ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. దీనికి తగ్గట్టుగానే షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసి, శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేనీ, యలమంచిలి రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా.. జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.