Parliament Special Session: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పటికే కేంద్ర మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు. దీంతో మంగళవారం ఆయా శాఖల మంత్రులు వారి వారి ఛాంబర్లలో బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో లోక్ సభ కార్యకలాపాల నిర్వహణ కోసం స్పీకర్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. అంతకంటే ముందుగానే కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. వీటన్నింటి కోసం పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం సమాయత్తమైంది. ఈ నెల 24 నుంచి జులై 3 వరకూ 8 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల్లోనే స్పీకర్ ఎన్నిక, ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుందని వెల్లడించాయి. జూన్ 24, 25 తేదీల్లో ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుందని.. జూన్ 26న స్పీకర్ ఎన్నికల ఉండొచ్చని తెలుస్తోంది.


లోక్‌సభ స్పీకర్ పదవి రేసులో..


ఈ క్రమంలో లోక్ సభ స్పీకర్ పదవి ఎవరికి దక్కనుందో అనేది ఆసక్తికరంగా మారింది. మోదీ 3.0 ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న టీడీపీ, జేడీయూ ఆ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ పోస్ట్ తమకు కావాలంటే తమకే ఇవ్వాలని పలువురు నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. అటు, రాజస్థాన్ కోటా స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇవ్వొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు కూడా పురంధేశ్వరికి కూడా ఈ పదవి ఇవ్వొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ పదవిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.