ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయానికి వచ్చింది. ఓజీహెచ్ భవనాన్ని కూల్చివేసి కొత్త భననాలు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో, కొత్త ఆసుపత్రి భవనాన్ని నిర్మించడానికి పాత భవనాలు కూల్చివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. జులై 27న సమర్పించిన అఫిడవిట్‌లో ప్రస్తుతం ఉన్న భవనం ఆసుపత్రికి పనికిరాదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కొత్త భవనాలకు 35.76 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం అవుతుందని, కొత్త OGH భవనం నిర్మాణం కోసం ఇతర నిర్మాణాలను కూల్చివేసే ప్రణాళికను వెల్లడించింది. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆరోగ్య శాఖ అధికారులు, జీహెచ్‌ఎంసీ, ఎంఏ అండ్ యూడీ, ఆర్ అండ్ బీ, ఓజీహెచ్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో గత ఎనిమిదేళ్లుగా ఓజీహెచ్ నిర్మాణంపై ఉన్న గందరగోళానికి ప్రభుత్వం ముగింపు పలికింది.
ప్రస్తుత భవనం శ్రేయష్కరం కాదు
ఉస్మానియా జనరల్ ఆసుపత్రి భవనం సురక్షితం కాదని, ఎటువంటి పరిస్థితుల్లో భవనం కూల్చివేతకు నిర్ణయం తీసుకున్నారో కారణాలను తెలిపింది. పాత భవనం ఎలాంటి రోగుల సంరక్షణకు పనికిరానిది, 35.76 లక్షల చదరపు అడుగుల ప్రత్యామ్నాయ ఆసుపత్రి అభివృద్ధికి ఉప భవనాలతో ఓజీహెచ్ భవనాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ దాఖలు చేసిన అఫిడవిట్ పేర్కొంది. శిథిలావస్థలో ఉన్న భవనాలు తొలగించిడంతో ప్రస్తుతం ఓజీహెచ్‌లో పడకల సంఖ్య 1,100లకు పడిపోయింది. ప్రస్తుతం ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య, పరిస్థితుల ప్రకారం ఆస్పత్రికి 1,812 పడకలు అవసరమని OGH సూపరింటెండెంట్ డాక్టర్ B. నాగేందర్ తెలిపారు.
ఉస్మానియా ఆస్పత్రి భవనం వివాదం
1919లో హైదరాబాద్ చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని నిర్మించారు. తెలంగాణ ఏర్పడ్డాక 2015 జూలై 23న సీఎం కేసీఆర్ ఆస్పత్రిని సందర్శించి రోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. భవనాన్ని కూల్చివేసి రూ.200 కోట్లతో ఆధునిక ఆసుపత్రిని నిర్మించనున్నట్లు ప్రకటించారు. సీఎం ప్రకటనలో వివాదం మొదలైంది. సీఎం నిర్ణయానికి అనుకూలంగా, వ్యతిరేకంగా అనేక పిటిషన్లు, PIL లు దాఖలయ్యాయి. కొద్ది రోజులకు డెక్కన్ ఆర్కియాలజికల్ అండ్ కల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైకోర్టును ఆశ్రయించింది. 2010 నవంబర్ 3న జారీ చేసిన GO 313లో పేర్కొన్న విధంగా ప్రస్తుత నిర్మాణాలకు మరమ్మతులు చేయాలని, కొత్త భవనాలను నిర్మించాలని కోరింది.
అంతకు ముందు ఉస్మానియా భవనాలపై అధ్యయనం కోసం ప్రభుత్వం జేఎన్‌టీయూ నిపుణులతో కమిటీ వేసింది. బాగు చేసినా ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం ఉండబోదని నిపుణుల బృందం చెప్పడంతో కూల్చివేతకు తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపింది. అయితే జేఎన్టీయూ నివేదికను ఇంటాక్ (భారతదేశం చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి కృషి చేసే ట్రస్ట్) తప్పు పట్టింది. ఇంటాక్ తమ ఇంజినీర్లను దిల్లీ నుంచి పిలిపించి మూడు రోజులు అధ్యయనం చేసింది. భవనం బలంగా, భద్రంగా ఉందని చాలా కాలం ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పైపైన దెబ్బతిన్నట్లు పేర్కొంది. ప్లాస్టరింగ్ పనులు చేసి అన్ని ఆధునిక సౌకర్యాలూ కల్పించవచ్చన్నారు. పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కొత్త భవనాలు కూడా కట్టవచ్చొన్ని ఇంటాక్ ఇంజినీర్లు సూచించారు.