Tamilisai Secretariat Visit: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తొలిసారిగా సందర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆలయంతో పాటు చర్చి, మసీదుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ముందుగా సచివాలయం వద్దకు చేరుకున్న ఆమెకు మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించారు. అనంతరం సీఎం కేసీఆర్ తో పాటు వెళ్లి గవర్నర్ తమిళిసై ఆలయాన్ని ప్రారంభించారు. అనంతరం అదే గుడిలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.


ఆపై ఆలయ ప్రాంగణంలో చేపట్టిన వరలక్ష్మీ దేవి వ్రత పూజలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత.. చర్చిని ప్రారంభించారు. అక్కడే కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, చర్చి ఫాస్టర్ లు గవర్నర్ కు బైబిల్ ను బహుమతిగా అందజేశారు. దీని తర్వాత నేరుగా మసీదు వద్దకు వెళ్లి.. సీఎం కేసీఆర్ తో కలిసి సమీదును ప్రారంభించారు. అక్కడే ముస్లిం సోదరులతో కలిసి ముచ్చటించారు. ఆపై ముస్లిం నాయకులు ఇచ్చిన బహుమతులను అందుకున్నారు.   














ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్ ను తీసుకొని సచివాలయానికి చేరుకున్నారు. మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గవర్నర్ తమిళిసైకి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ ను సచివాలయ ప్రాంగణం మొత్తం కలియ తిరుగుతూ చూపించారు. ఒక్కో అంతస్తు గురించి తమిళిసైకి ముఖ్యమంత్రి స్వయంగా వివరించారు. అనంతరం గవర్నర్ కు సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలుకుతూ.. కేసీఆర్ 6వ అంతస్తులోని తన ఛాంబర్ కు తీసుకు వెళ్లారు.


అక్కడ ఆమెను శాలువాతో సత్కరించారు. పూల బొకే అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కుంకుమ బొట్టుతో గవర్నర్ తమిళిసైని సాంప్రదాయ పద్ధతిలో సన్మానించారు. అనంతరం గవర్నర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆతిథ్యం ఇచ్చారు. సచివాలయ నిర్మాణం, ఏర్పాటు చేసిన అధునాతన మౌలిక వసతులు, ఆధునికతకు పట్టం కట్టడం లాంటి వివరాలను గవర్నరే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాసేపు అక్కడే ఇష్టాగోష్ఠి నిర్వహించారు. సచివాలయ సందర్శన పూర్తి చేసుకున్న తర్వాత.. తమిళిసై సౌందర రాజన్ కి ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి సీఎం కేసీఆర్ వీడ్కోలు పలికారు.