Governor Delhi Tour : తెలంగాణ గవర్నర్ తమిళిసై దిల్లీకి వెళ్లనున్నట్లు సమచారం. ఒకరోజు పర్యటనలో భాగంగా గవర్నర్ దిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో గవర్నర్ తమిళి సై తెలంగాణలో తాజా పరిస్థితులను కేంద్రానికి వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ దిల్లీ టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దిల్లీలో వివిధ కార్యక్రమాల్లో గవర్నర్‌ పాల్గొననున్నట్లు సమాచారం. దీంతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తమిళి సై భేటీ అయ్యే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవ్వనున్నట్లు తెలుస్తోంది.  






కేసీఆర్ వెనక్కి తగ్గారా? 


అయితే తెలంగాణలో రాజ్ భవన్ , ప్రగతి భవన్ మధ్య పరిస్థితులు మెరుగుపడినట్లు కనిపిస్తున్నా ఏ క్షణంలోనైనా వార్ రిస్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీతో సంబంధాలు క్షీణించిన తర్వాత కేసీఆర్ కేంద్రంపై తరచూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీంతో గవర్నర్ వ్యవస్థనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం గవర్నర్ సాయంతో రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే గవర్నర్ కు సరైన ప్రొటోకాల్ పాటించడంలేదని రాజ్ భవన్ తరఫున నుంచి వినిపిస్తున్న వాదనలు.  రిపబ్లిక్ డే వేడుకలు జరపకపోవడంపై కేంద్రానికి రిపోర్ట్ పంపినట్లు గవర్నర్ తమిళి సై ఇటీవల ప్రకటించారు. అలాగే బడ్జె్ట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ముందు క్లారిటీ ఇవ్వకపోవడంతో.. బడ్జెట్ ఆమోదానికి కొంత సమయం తీసుకున్నారు గవర్నర్. బడ్జెట్ సమావేశాలు దగ్గరు వస్తున్నా గవర్నర్ కావాలనే బడ్జెట్ ప్రతిపాదనను ఆమోదించలేదని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపించింది. అనంతరం గవర్నర్ పై హైకోర్టుకెక్కింది. ఆ తర్వాత నిర్ణయం మార్చుకుని కోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకుని,  గవర్నర్ స్పీచ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


గవర్నర్, ప్రభుత్వం మధ్య సయోధ్య కుదిరినట్లేనా? 


బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ స్పీచ్ ఆసక్తికరంగా మారింది. ఈ ప్రసంగంలో తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడంతో పాటు కేంద్రాన్ని విమర్శించేలా రాష్ట్ర ప్రభుత్వం పంపిన స్పీచ్ ను గవర్నర్ యథావిధిగా చదివారు. గవర్నర్ స్పీచ్ పై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో తమిళి సై పంతం నగ్గించుకున్నారని అందరూ అనుకున్నా.. కేసీఆర్ వ్యూహాత్మకంగా గవర్నర్ తోనే కేంద్రంపై విమర్శలు చేయించారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పరిస్థితులు మెరుగుపడుతున్న తరుణంలో తమిళి సై దిల్లీ టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దిల్లీ టూర్ అనంతరం గవర్నర్ ఎలా వ్యవహరిస్తారో అన్న దానిపై విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్న సమయంలో కేంద్రంలోని బీజేపీ కేసీఆర్ అడ్డుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.  గత కొంత కాలంగా ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య వార్ నడిచింది. ప్రొటోకాల్ పాటించడంలేదని గవర్నర్, ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ వివాదం ముదురుతున్న వేళ బడ్జెట్ సమావేశాలు వచ్చాయి. ఈ సమావేశాల్లో గవర్నర్ స్పీచ్ కు ప్రభుత్వం అంగీకరించడంతో కొంత సయోధ్య కుదిరినట్లు అయింది. అయితే భవిష్యత్తులో పరిస్థితుల మారతాయా? మళ్లీ మొదటికి వస్తాయా? వేచిచూడాలి.