తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో నిర్మించిన నూతన పరకామణి భవనాన్ని టిటిడి ఈవో ఏవీ.ధర్మారెడ్డి ప్రారంభించారు. ముందుగా ఉదయం 9 గంటల నుండి నూతన పరకామణి భవనంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, గోమాత ప్రవేశం, గోపూజ, సుదర్శన హోమం వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఆలయం నుండి తీసుకుని వచ్చిన హుండీ కానుకలను వేరు చేయడం, లెక్కించడం ప్రక్రియను ప్రారంభించారు.
బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన పరకామణి భవనాన్ని టీటీడీ నిర్మించింది. గత ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 28న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఈ భవనంలో అభివృద్ధి పనులను టిటిడి చేపట్టింది. శ్రీవారి దర్శనార్శం తిరుమలకు విచ్చేసిన భక్తుడు స్వామి వారికి సమర్పించే కానుకల లెక్కింపు స్వయంగా వీక్షించే విధంగా భవనంకు నలువైపులా అద్దాలు ఏర్పాటు చేసింది టిటిడి. ఈ సందర్భంగా టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ. తిరుమలలో అత్యాధునిక వసతులతో నిర్మించిన నూతన పరకామణి భవనంను ప్రారంభించడం జరిగిందన్నారు.
ఈ నూతన పరకామణి భవనంలో అన్ని సిబ్బందికి అవసరం అయ్యే అన్ని ఏర్పాట్లు కల్పించడం జరిగిందని, అయితే ఇవాళ 12 హుండీలను శ్రీవారి ఆలయం నుండి నూతన పరకామణికి తరలించి, లెక్కింపు ప్రక్రియను ప్రారంభించామన్నారు. అయితే ముందస్తుగా హుండీ కానుకలను పరకామణికి తరలించేందుకు ట్రయల్ రన్ చేశామని, నేడు అది సక్సెస్ పుల్ అయిందని అన్నారు. రేపటి నుండి హుండీ కానుకలను నూతన పరకామణి భవనంలో లెక్కించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. శ్రీవారి ఆలయంలో ఉన్న ప్రస్తుత పరకామణిలో భక్తులు కూర్చుని ధ్యానం చేసుకోడానికి స్థలం కేటాయించడం జరిగిందన్నారు.
స్వామి వారి హుండీ కానుకల లెక్కింపు భక్తులు వీక్షించే విధంగా ఇరువైపులా అద్దాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రతి రోజు దాదాపుగా 12 నుండి 13 హుండీలు పరకామణికి వస్తాయని, ఏ రోజుకు ఆ రోజు హుండీ కానుకలను లెక్కించే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రతి నిత్యం 225 మంది సిబ్బంది పరకామణి విధులు నిర్వర్తించే విధంగా చర్యలు తీసుకున్నట్లు టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి తెలియజేశారు.