Telangana CM Camp Office: తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ప్రగతిభవన్ (ప్రజాభవన్)లో కాకుండా మరో చోటికి మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ప్రాంగణలోకి సీఎం క్యాంపు కార్యాలయం మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిన్ననే (ఆదివారం) ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ ప్రాంగణాన్ని సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీని సీఎం క్యాంప్ ఆఫీసుగా మార్చేందుకు గల సాధ్యాసాధ్యాలపై రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించినట్టు సమాచారం.
ప్రస్తుతం ప్రగతిభవన్... ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా ఉంది. తెలంగాణ సీఎంగా కేసీఆర్ (KCR) బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రగతిభవన్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో.... ప్రగతిభవన్‌ను డాక్టర్ జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌గా మార్చారు. రోజూ ప్రగతిభవన్(Pragati Bhavan)లో ప్రజాదర్బార్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రజాదర్భార్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు కూడా ఉదయం 10 గంటల నుంచి గంట పాటు ప్రజలకు అందుబాటులో ఉండి వారి నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు. దీంతో... సీఎం క్యాంప్ కార్యాలయాన్ని మరోచోటికి మార్చాలని ప్రయత్నిస్తున్నారు రేవంత్‌రెడ్డి.
ప్రస్తుతం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి సమీపంలో రేవంత్‌రెడ్డి నివాసం ఉంది. ఇప్పుడు అక్కడి నుంచే సచివాలయం, ప్రజాభవన్‌కు వెళ్తున్నారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ఉంటున్న ఇంటికి, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)కి దూరం చాలా తక్కువ. దీంతో అక్కడే క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సిటీలో అందుబాటులో ఉండేలా.. సామాన్యులకు ఇబ్బంది లేకుండా.. ఈ ఏరియా అయితే సరిపోతుందని భావిస్తున్నారట. దీంతో ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ (MCRHRD) కార్యాలయానికి భద్రతతో పాటు ఇతర అంశాలను కూడ అధికారులు పరిశీలించనున్నారు.
నిన్న (ఆదివారం) సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క, అధికారులు కలిసి ఎంసీహెచ్‌ఆర్‌డీ(MCRHRD) భవనాన్ని పరిశీలించారు. ఎంసీఆర్‌హెచ్ఆర్డీ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యారు ముఖ్యమంత్రి. ఆ సంస్థ కార్యకలాపాల గురించి ఆరా తీశారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత సంస్థలోని వివిధ బ్లాకులను పరిశీలించారు. ముఖ్యమంత్రికి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా... అన్ని విషయాలు వివరించారు ఎంసీఆర్‌హెచ్ఆర్డీ (MCRHRD) డీజీ డాక్టర్ శశాంక్ గోయల్.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ) ప్రాంగణం దాదాపు 45 ఎకరాల విస్తీర్ణంతో ఉంది. అక్కడ 150 మంది కూర్చునే నాలుగు కాన్ఫరెన్స్ హాళ్లు, పరిపాలక మండలి సమావేశం కావడానికి వీలుగా బోర్డ్ రూమ్, 250 మంది వరకు కూర్చునేలా ఆడిటోరియం, అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి మంజరీ, కృష్ణ, గోదావరి, తుంగభద్ర పేర్లతో విడివిడి బ్లాకులు ఉన్నాయి. పైగా ఎంసీహెచ్‌ఆర్‌డీ భవనాన్ని క్యాంప్ కార్యాలయంగా ఉపయోగించుకుంటే ట్రాఫిక్ సమస్య ఉండదని సీఎం భావిస్తున్నారట. ఒకవేళ ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీని సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తే.... అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ సంస్థను ప్రజాభవన్‌కు తరలించే అవకాశాలు ఉన్నట్లు తెలిస్తోంది. ప్రభుత్వం దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.