GHMC Key Officers Transfer: రాష్ట్రంలో పలు కీలక శాఖల్లో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్న వారికి స్థానచలనం కల్పిస్తూ రేవంత్ సర్కార్ అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ప్రక్షాళన మొదలుపెట్టింది. తాజాగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని కీలక అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కూకట్పల్లి జోనల్ కమిషనర్ గా ఉన్న తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు వి.మమతను (Mamatha) నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ కు బదిలీ చేసింది. ఆమె స్థానంలో ఐఏఎస్ అధికారి అభిలాష అభినవ్ (Abhilasha Abhinav) ను నియమించింది. కాగా, 2010 నుంచి 2018 వరకూ శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ గా మమత పని చేశారు. 2018 నుంచి కూకట్పల్లి జోనల్ కమిషనర్ గా కొనసాగుతున్నారు. అలాగే, శేర్లింగపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి డిప్యుటేషన్ రద్దు చేసి ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి స్నేహ శబరీష్ కు బాధ్యతలు అప్పగించింది.


ఈ అధికారుల బదిలీ


వీరితో పాటు మరికొంత మంది డిప్యూటీ కమిషనర్లకూ ప్రభుత్వం స్థానచలనం కల్పించింది.



  • GHMC సూపరింటెండెంట్ ఇంజినీర్ వెంకటరమణ మూసీ నది అభివృద్ధి సంస్థ ఎస్ఈగా బదిలీ చేసింది. అక్కడ ప్రస్తుతం ఎస్ఈగా ఉన్న మల్లికార్జునుడిని ఈఎన్ సీ (ENC) కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

  • జీహెచ్ఎంసీ ఫలక్ నుమా డిప్యూటీ కమిషనర్ గా వై.శ్రీనివాసరెడ్డి, ఫలక్ నుమా అసిస్టెంట్ కమిషనర్ గా డి.లావణ్య, కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్ గా వి.నర్సింహ నియమితులయ్యారు.

  • సంతోష్ నగర్ డిప్యూటీ కమిషనర్ గా ఎ.నాగమణి, ఛార్మినార్ డిప్యూటీ కమిషనర్ గా ఎ.సరితను నియమిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు.


ఇటీవలే భారీగా ఐఏఎస్ ల బదిలీ


రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే భారీగా ఐఏఎస్ లను బదిలీ చేసింది. ఈ నెల 3న (బుధవారం) ఏకంగా 26 మంది ఐఏఎస్ ల బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి, మహబూబాబాద్, గద్వాల, నల్గొండ జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ.. కొత్త కలెక్టర్లను నియమించింది సర్కార్. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ మెంబర్ గా స్మితా సబర్వాల్ ను నియమించారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా తప్పించిన భారతీ హోలికేరికి పురావస్తు శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించారు.


బదిలీ అయిన అధికారుల వివరాలు



  • ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా డి. దివ్య, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్, పురావస్తు శాఖ డైరెక్టర్ గా భారతీ హోలికేరి నియమితులయ్యారు.

  • ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కా, టీఎస్ డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చిట్టెం లక్ష్మీ, టీఎస్ పీసీబీ మెంబర్ సెక్రటరీగా క్రిష్ణ ఆదిత్యలను నియమించారు.

  • ముఖ్యమంత్రి, సీఎంవో జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్, హైదరాబాద్ (స్థానిక సంస్థలు) అడిషనల్ కలెక్టర్ పి కదిరావన్, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి.వెంకటేశంలకు బాధ్యతలు అప్పగించారు.

  • నల్గొండ జిల్లా కలెక్టర్‌గా దాసరి హరి చందన, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా అద్వైత్ కుమార్, రంగారెడ్డి కలెక్టర్‌గా శశాంక, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా వల్లూరు క్రాంతి, గద్వాల జిల్లా కలెక్టర్‌గా బీఎం సంతోష్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 


Also Read: Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - మరిన్ని ప్రత్యేక రైళ్ల ప్రకటన, షెడ్యూల్ ఇదే