Anganwadi strike in AP: అనంతపురం జిల్లా: అంగన్‌వాడీల ఉద్యమంపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వారిపై ఎస్మా ప్రయోగిస్తూ జీవో నెంబర్‌ 2ను జారీ చేసింది. ఆరు నెలల పాటు ఎలాంటి సమ్మెలు, ఆందోళనలు చేయొద్దని ఆదేశాల్లో పేర్కొంది. కానీ తమ సమస్యలకు పరిష్కారం కోసం, డిమాండ్లు నెరవేర్చుకునేందుకు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నెలరోజుగా సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో పెనుగొండలో సమ్మెలో పాల్గొన్న ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను తోటి అంగన్వాడీలు సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


కొంతమంది అంగన్వాడీలు మంత్రి ఉషశ్రీ చరణ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే కలగజేసుకున్న పోలీసులు అంగన్వాడీలను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మంత్రిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు యత్నించగా.. ఖాకీలను అడ్డుకునేందుకు అంగన్వాడీలు సైతం వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో అక్కడ ఉద్రికత్త పరిస్థితి నెలకొని ఓ అంగన్వాడీ కళ్లు తిరిగి పడిపోవడంతో ఆందోళన నెలకొంది. 


తాడిపత్రి : తాడిపత్రిలోనూ అంగన్వాడీల ఆందోళన ఉధృతం చేశారు. పారిశుద్ధ కార్మికులు తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ చాంబర్ ఎదుట చెత్త , కోళ్ల వ్యర్థాలు పోసి , కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. కనీస వేతనాలు మరియు అవుట్సోర్సింగ్ సిబ్బంది ని రెగ్యులరైజ్ చేయాలంటూ  రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్న పారిశుద్ధ కార్మికులు ఈరోజు తాడిపత్రి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ చాంబర్ ఎదుట చెత్త, కోళ్ల వ్యర్థాలు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. తమకు కనీస వేతనాలు చెల్లించాలంటూ దాదాపు 12  రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని, తక్షణమే తమ డిమాండ్లు పరిష్కారం చేయకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ పారిశుద్ధ కార్మికులు హెచ్చరించారు. అదేవిధంగా  ఔట్సోర్సింగ్ సిబ్బందికి కొంతమంది మున్సిపల్ అధికారులు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ, ఉద్యోగాలు పీకేస్తామంటూ బెదిరిస్తున్నారని కమీషనర్ తో  పారిశుద్ధ కార్మికులు వాగ్వాదం చేశారు.


అంగన్వాడీల సమ్మె నిషేధిస్తూ జీవో నెం 2
ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపినా, అంగన్‌వాడీలు మాత్రం తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా అంగన్వాడీలు వెనక్కి తగ్గకపోవడంతో అంగన్వాడీల సేవలను అత్యవసర సర్వీసు కిందకు తీసుకొచ్చింది. వారిపై ఎస్మా ప్రయోగిస్తూ జీవో నెం 2 విడుదల చేసింది. దాంతో 6 నెలలపాటు వీరు ఏ సమ్మె కార్యక్రమాలు చేపట్టడానికి వీలు ఉండదు. 


ఏంటీ ఎస్మా..
2013లో తీసుకొచ్చిన జాతీయ ఆహార భద్రత చట్టంలోని సెక్షన్ 39 పరిధిలోకి అంగన్వాడీలు వస్తారని ప్రభుత్వం వాదిస్తోంది. అందుకే అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించినట్టు పేర్కొంది. ఈ ఎస్మాను 1981లో  తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి సమ్మెలు చేస్తే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. అంగన్‌వాడీలను డిస్మిస్‌ చేయవచ్చు. కావాలనుకుంటే పరిస్థితిని బట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయవచ్చు. ఈ కేసుల్లో సమ్మెచేసిన వారికి ఆరు నెలలు, సహకరించిన వారికి ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.