KRMB Meeting: శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు, పవర్ హౌస్‌ల నిర్వహణపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఇరు రాష్ట్రాల మధ్య గొడవ మళ్లీ మొదటికి వచ్చింది. కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) లక్ష్యం నెరవేరలేదు. ఈ కమిటీ రూపొందించిన ముసాయిదా నివేదికపై సోమవారం జరిగిన చివరి సమావేశంలో ఏపీ ప్రతినిధులిద్దరూ సంతకాలు చేయగా.. తెలంగాణ ప్రతినిధులు గైర్హాజరు అయ్యారు. అంతేకాకుండా ముసాయిదాను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ కు లేఖ రాసింది. దీంతో ఆర్ఎంసీ కన్వీనర్, బోర్డు నుంచి ఉన్న మరో సభ్యుడు సంతకాలు చేసి నివేదికను బోర్డుకు పంపినట్లు తెలిసింది. అయితే దీనికి తెలంగాణ అంగీకరించకపోవడంతోపాటు వ్యతిరేకిస్తూ... అంశాల వారీగా లేఖ రాసిన నేపథ్యంలో ఈ నివేదిక అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ కోసం అవసరమైన విధానాలు రూపొందించేందుకు ఆరు నెలల క్రితం కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో కీలక అధికారిగా ఉన్న
రవికుమార్ పిళ్లై నేతృత్వంలో ఆర్ఎంసీ ఏర్పాటు అయింది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల నీటిపారుదల, జెన్‌కో చీఫ్ ఇంజినీర్లు సభ్యులుగా ఉన్నారు. పవర్ హౌస్ ల నిర్వహణ, వరద నీటి వినియోగం, రిజర్వాయర్ల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోవడం ఈ కమిటీ బాధ్యత. గత శనివారం కమిటీ ఆరో సమావేశం నిర్వహించగా రెండు రాష్ట్రాల అధికారులు హాజరై ముసాయిదా నివేదికపై చర్చించారు. సోమవారం మళ్లీ సమావేశమై తుది ఆమోదం తెలపాల్సి ఉండగా.. తెలంగాణ ప్రతినిధులు గైర్హాజరయ్యారు. వారు లేకుండానే కమిటీ చర్చించింది. కమిటీలో ఆరుగురు సభ్యులు ఉండగా.. నలుగురు ఆమోదం తెలిపి బోర్డుకు పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
గత సమావేశంలో ఇరు రాష్ట్రాల కామెంట్లు..
కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణ 50:50 నిష్పత్తిలో వాటా ఇవ్వాలని కోరుతున్నామని తెలంగాణ అధికారులు బోర్డుకు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కోసమేనని తెలంగాణ అధికారులు అంటున్నారు. ఈ విషయంలో ఏపీ అభ్యంతరం తగదన్నారు. పట్టిసీమ నుంచి గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నారని, అయినా తెలంగాణకు అదనంగా రావాల్సిన నీరు ఇవ్వడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
పోటీపడి విద్యుత్ ఉత్పతి...
2021-22లో శ్రీశైలం నుంచి నీటి విడుదలపై(విద్యుదుత్పత్తి) ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాలు పోటీపడి విద్యుదుత్పత్తి చేశారని, తమ ఆదేశాలను ఉల్లంఘించారని బోర్డు అంటోంది. తెలంగాణ 218 టీఎంసీల నీటిని వినియోగించుకుని 281 రోజుల్లో 1217 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసింది. ఏపీ 200 టీఎంసీలతో 183 రోజుల్లో 1146 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. శ్రీశైలంలో గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే అవకాశం లేనప్పుడు విద్యుదుత్పత్తి చేశారని బోర్డు తెలిపింది. 501 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి వెళ్లాయని పేర్కొంది. ఇందులో ఎక్కువ నీటిని ఆదా చేయడానికి అవకాశం ఉందని బోర్డు తెలిపింది. ఎజెండాలో శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు రూ.800 కోట్లు, నాగార్జునసాగర్, పులిచింతలకు మరో రూ.30 కోట్లు అవసరమని పేర్కొంది.
జలాశయాల నిర్వహణ కొలిక్కి వచ్చేదెప్పుడు?
జలాశయాల నిర్వహణ కమిటీ తుది సమావేశానికి తెలంగాణ హాజరై ఉంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల నిర్వహణలో రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడుతున్న సమస్యలు కొలిక్కి వచ్చి ఉండేవని ఏపీ జల వనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆర్ఎంసీ సమావేశం అనంతరం హైదరాబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నివేదికపై ఏపీ సంతకం చేసిందని తెలిపారు. తెలంగాణ కూడా సంతకం చేసి ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం దొరికేదన్నారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి విషయంలోనూ ఇరు రాష్ట్రాల మధ్య స్పష్టత వచ్చేదని పేర్కొన్నారు. త్రిసభ్య కమిటీకి బదులు శాశ్వత ఆర్ఎంసీ కూడా ఏర్పాటు అయ్యేదని ఇకపై ఆర్ఎంసీ ఉంటుందా అనే దానిపై స్పష్టత లేదన్నారు.