Guidelines for Rythu Bharosa scheme in Telangana | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఈనెల 26 వ తేదీ నుంచి అన్నదాతలకు రైతు భరోసా పథకిం అందించనుంది. రాష్ట్రంలోని రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించడానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. భూ భారతి పోర్టల్ (Bhu Bharati Portal)లో నమోదైన రైతులు వ్యవసాయం చేస్తున్న భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించనున్నారు. ఈ మేరకు రైతు భరోసాపై తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో ఆర్టీ నంబర్ 18 / తేదీ 10-01-2025) జారీ చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతులకు సంబంధించిన అంశాలు సరళంగా అర్థం కావాలన్న ఉద్దేశంతో రైతు భరోసా జీవోను తెలుగులో వెలువరించింది. గతంలో రుణమాఫీ మార్గదర్శకాలపైన తెలుగులో జీవో జారీ చేయడం తెలిసిందే. #RythuBharosa
జనవరి 26న రైతు భరోసా అమలు
తెలంగాణ ప్రభుత్వం వ్వవసాయాన్ని లాభసాటిగా చేయడానికి నిర్ణయాలు తీసుకుంటుందని.. రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని రైతు భరోసా కింద రూ. 12 వేలు ఇవ్వనుందని అధికారులు తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి సాయంతో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటించడానికి, అవసరమైన వనరులను సేకరించడానికి వీలుంటుందని తాజా ఉత్తర్వులలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం "రైతు భరోసా" పథకాన్ని జనవరి 26 నుంచి అమలు చేయనుంది.
రైతుభరోసా పథకం (Rythu Bharosa)లోని ముఖ్యాంశాలు:
3.1 రైతు భరోసా స్కీమ్ కింద పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి ఎకరాకు రూ.12,000 కు పెంచాం.
3.2 భూభారతి (Dharani To Bhu Bharati Portal) పోర్టల్ లో నమోదైన వ్యవసాయ భూమి విస్తీర్ణం ఆధారంగా రైతుభరోసా సహాయం అందించాలి. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని పట్టాదారుల భూములను రైతుభరోసా నుండి తొలగించాలి.
3.3 ROFR పట్టాదారులు కూడా రైతు భరోసా పంట పెట్టుబడికి అర్హులు.
3.4 ఆర్బీఐ నిర్వహించే DBT విధానంలో రైతు భరోసా సహాయం అన్నదాతల బ్యాంకు ఖాతాలో జమ చేయాలి.
3.5 రైతు భరోసా పథకాన్ని వ్యవసాయశాఖ సంచాలకులు, తెలంగాణ ప్రభుత్వం తరఫున అమలు చేస్తారు.
3.6 National Informatics Centre (నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్), IT భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారు.
3.7 తమ జిల్లాకు సంబంధించిన రైతు భరోసా పథకం అమలుతో పాటు ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా కలెక్టర్లు బాధ్యులుగా ఉంటారు.
4. వ్యవసాయశాఖ సంచాలకులు ఈ పథకం అమలు విషయంలో తగు చర్యలు తీసుకోవాలి.
5. 2909660-A/06/A1/EBS.II/2025, తేదీ 10.01.2025 తో జారీ చేశారు
(తెలంగాణ గవర్నరు ఉత్తర్వు మేరకు ఏపిసి అండ్ ప్రభుత్వ కార్యదర్శి యం.రఘునందన్ రావు రైతు భరోసాకు సంబంధించి ఉత్వర్వులు జారీ చేశారు.
.
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఎకరానికి రూ.15వేలు అని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు 3 వేలు తగ్గించి రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రైతు కూలీలకు ఇంకా రూ.12 వేలు ఇవ్వడం మొదలుపెట్టలేదని, ఏడాది పాలన పూర్తైనా నిర్ణయం కూడా తీసుకోలేదని మండిపడుతున్నారు.