Free Current: ఫ్రీ కరెంట్ - తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Telangana Gruha Jyothi: రాష్ట్రంలో గృహజ్యోతి పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత కరెంట్ కోసం లబ్ధిదారులు ఆధార్ ధ్రువీకరణ చేయించుకోవాలని స్పష్టం చేసింది.

Continues below advertisement

Aadhar Authentication For Gruha Jyothi: రాష్ట్రంలో ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 'గృహజ్యోతి' (GruhaJyothi) పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అమలు ప్రక్రియలో భాగంగా లబ్ధి పొందాలనుకునేవారు తొలుత ఆధార్ ధ్రువీకరణ (అథెంటిఫికేషన్) చేయించుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులిచ్చింది. రాయితీ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలంటే ఆధార్ సహా గుర్తింపు కార్డులు అవసరమని తెలిపింది. బయోమెట్రిక్ విధానంలో ఆ ధ్రువీకరణ పూర్తి చేస్తేనే పేర్లు నమోదు చేస్తామని ఇంధన శాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కంలకు సూచించింది. దీని ప్రకారం ఈ పథకం కోసం లబ్ధిదారుల ఎంపికకు పూర్తి స్థాయి మార్గదర్శకాలు తర్వాత వెలువడుతాయని భావిస్తున్నారు. 

Continues below advertisement

లబ్ధిదారులు ఇలా చేయాలి

'గృహజ్యోతి' (GruhaJyothi) పథకం కింద లబ్ధిదారుల ఆధార్ ధ్రువీకరణ ప్రక్రియను డిస్కంలు చేపట్టాలని ఇంధనశాఖ ఆదేశాలిచ్చింది. లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలంటే ఇంటి కరెంట్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో.. వారి ఆధార్ విద్యుత్ సిబ్బందికి అందజేయాలి. ఎవరికైనా ఆధార్ లేకుంటే వెంటనే దరఖాస్తు చేసుకుని.. ఆ రశీదు చూపాలి. ఆధార్ జారీ అయ్యే వరకూ ఏదైనా ఇతర గుర్తింపు కార్డును విద్యుత్ సిబ్బందికి అందజేయాలి. బ్యాంక్ లేదా పోస్టాఫీస్ పాస్ బుక్ లో ఖాతాదారుడి ఫోటోతో ఉన్న జిరాక్స్, పాన్ కార్డు, పాస్ పోర్ట్, ఓటరు గుర్తింపు కార్డు, ఉపాధి హామీ పథకం గుర్తింపు కార్డు, కిసాన్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఎవరైనా గెజిటెడ్ అధికారి లేదా తహసీల్దార్ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం.. వీటిలో ఏదో ఒకటి విద్యుత్ సిబ్బందికి ఇచ్చి పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ సమాచారం ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని డిస్కంలకు ఇంధన శాఖ నిర్దేశించింది. 

ఆధార్ ధ్రువీకరణ ఇలా

ఆధార్ ధ్రువీకరణ పొందాలంటే బయోమెట్రిక్ పరికరాలతో వేలిముద్ర లేదా కనురెప్పలను స్కాన్ చేయాలి. ఇందు కోసం తగిన ఏర్పాట్లను డిస్కంలే చేయాలని ఇంధన శాఖ సూచించింది. ఒకవేళ, పరికరాలు పనిచేయకపోతే ఆధార్ నెంబర్ ను నమోదు చేయగానే దాని యజమాని సెల్ ఫోన్ కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలి. ఇది కూడా సాధ్యం కాకుంటే ఆధార్ కార్డుపై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవాలి. ఇలా ఏ ప్రయత్నాన్ని వదలకుండా ఎలా వీలైతే అలా.. లబ్ధిదారులకు ఆధార్ ధ్రువీకరణ పూర్తి చేయాలని డిస్కంలను ఆదేశించింది. కాగా, ఉచిత విద్యుత్ పథకం పొందాలంటే రేషన్ కార్డును తప్పనిసరి చేస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇక... నిబంధనల ప్రకారం ఉచిత విద్యుత్‌ పథకానికి అర్హులైన వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి డిస్కంలు ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి. 

Also Read: TSPSC: టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల - వెబ్‌సైట్‌లో మెరిట్ జాబితాలు

 

Continues below advertisement
Sponsored Links by Taboola