Telangana: లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్దమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ రాష్ట్ర బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకోవాలని చూస్తోంది. అందుకే ఎన్నికలపై స్పీడ్ పెంచింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా యాత్రకు రెడీ అవుతోంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఐదు క్లస్టర్లలో రథయాత్రలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. జాతీయ బీజేపీ నేతలు ఈ రథయాత్రలను ప్రారంభించనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు రథయాత్రలను ప్రారంభించేలా తెలంగా బీజేపీ సన్నాహాలు చేస్తోంది. 20 నుంచి 29వ తేదీ వరకు 10 రోజుల పాటు యాత్రలు కొనసాగనున్నాయి. బీజేపీ అగ్రనేతలు కూడా ఈ యాత్రలలో పాల్గొని ఎన్నికల ప్రచారం చేయనున్నారు.


గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు కేవలం 8 సీట్లను మాత్రమే బీజేపీ గెలుచుకుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి బలం పెంచుకోవాలని కాషాయ దళం చూస్తోంది. దీంతో పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు తేడా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీ వస్తే బాగుంటుందనేది పరిగణలోకి తీసుకుని ప్రజలు ఓట్లు వేస్తారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ అంశాల ఆధారంగా ఓట్లు వేస్తారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో బీజేపీ బలంగా ఉంటుంది. ప్రధాని మోదీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో బీజేపీ హవా దేశవ్యాప్తంగా మరింత పెరిగింది. తెలంగాణలో కూడా దీని ప్రభావం ఉండే అవకాశముంది.


2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక్క స్థానం మాత్రమే గెలుచుకుంది. గోషామహల్ నుంచి రాజాసింగ్ ఒక్కరే విజయం సాధించారు. కానీ ఆ తర్వాత జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎవరూ ఊహించని విధంగా 4 స్థానాలు గెలుచుకుంది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు విజయం సాధించారు. దీనిని బట్టి చూస్తే అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలను ప్రజలు వేరుగా చూస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలుచుకోగా..13.9 శాతం ఓట్లను దక్కించుకుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో 10 స్థానాలను దక్కించుకోవాలనేది బీజేపీ టార్గెట్‌ పెట్టుకుంది. అందుకు తగ్గట్లు కార్యాచరణను రూపొందిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను కూడా కాషాయ పార్టీ చేపట్టింది. అభ్యర్థులను దాదాపు ఖరారు చేయగా.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రకటించే అవకాశముంది.


బీజేపీ ఎప్పుడూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే అభ్యర్థుల ప్రకటన చేస్తూ ఉంటుంది. ఈ సారి ఎన్నికల్లో కూడా అదే ఫార్ములాను ఫాలో కానుంది. అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా లోక్‌సభ ఎన్నికలపై కసరత్తు చేస్తోన్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించింది. ఇక రేవంత్ రెడ్డి ఇటీవల పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించారు. ఇటీవల వచ్చిన వివిధ సర్వేలు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్‌ 12 పార్లమెంట్ సీట్లను గెలుచుకునే అవకాశముందని అంచనా వేశాయి. ఈ సర్వే ఫలితాలు హస్తం పార్టీలో జోష్ నింపుతున్నాయి.