Vijayawada: టీడీపీ అధినేత చంద్రబాబుపై, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తండ్రీకొడుకులిద్దరూ కలిసి టికెట్లు అమ్ముకుంటారని, వచ్చిన డబ్బుతో ఎన్నికల తర్వాత తెలంగాణకు వెళ్లిపోతారని ఆరోపించారు. ఎన్నికల పూర్తైన తర్వాత టీడీపీ ఆఫీస్‌కు తాళం వేసుకుని హైదరాబాద్ వెళ్లిపోతారని, చంద్రబాబు ఫ్యామిలీకి అమరావతి ప్రాంతంలో సొంత ఇల్లు కూడా లేదని అన్నారు. చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలు అని, ఆ తర్వాత తట్టాబుట్టా సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోవడం ఖాయమని కేశినేని నాని జోస్యం చెప్పారు. సీఎం జగన్‌ను చూసి చంద్రబాబు, లోకేష్ బుద్ది తెచ్చుకోవాలని సూచించారు.
చంద్రబాబు, లోకేష్ సీట్లు అమ్ముకుంటున్నారు!
సీఎం వైఎస్ జగన్ పేదలకు సీట్లు ఇస్తుంటే.. చంద్రబాబు, లోకేష్ కలిసి సీట్లు అమ్ముకుంటున్నారని కేశినేని నాని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను చూసి ఇద్దరూ సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని, ఆయన మాటలను ప్రజలు నమ్మరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే గెలుపు అని, ఎవరూ ఆపలేరని నాని జోస్యం చెప్పారు. అయితే కేశినేని నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన కామెంట్స్‌కు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. నానిని టీడీపీ నుంచి చంద్రబాబు, లోకేష్ గెంటేశారని, అందుకే ఇలా వారిపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు, లోకేష్ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే కేశినేని భవన్‌కు వెళ్లి నానిని కొడతానంటూ బుద్దా వెంకన్న ఘాటుగా స్పందించారు. కేశినేని నానికి సంబంధించిన ఒక హోటల్‌లో జరిపే భాగోతం వివరాలను త్వరలోనే బహిర్గతం చేస్తానంటూ బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నానిపై బుద్ధా సంచలనం!
గతంలో కూడా విజయవాడతో పాటు హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో గెస్ట్‌హౌస్‌లు నడుపుతూ నాని సెక్స్ రాకెట్ నిర్వహించారని బుద్దా వెంకన్న ఆరోపించారు. నాని ఒక బ్రోకర్ అని, పండుగల సమయంలో బస్సు టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్న వ్యక్తి అని ఆరోపించారు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కూడా చిరంజీవి టికెట్లు అమ్ముకున్నారని నాని ఆరోపణలు చేశారని అన్నారు. చంద్రబాబు కర్ణుడు లాంటి వారని, ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదన్నారు. నాని నిజస్వరూపం తెలిసే ఆయనను పార్టీ నుంచి బయటకు పంపించారని, ఇప్పుడు జగన్ వంచన చేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ టికెట్లను అమ్ముకుంటున్నారని, ఒక్కొక్కరిని రూ.140 కోట్లు అడుగుతున్నారని ఆరోపించారు. నాని దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రెండుసార్లు చంద్రబాబు ఎంపీ టికెట్ ఇచ్చారని, టీడీపీ నేతలే తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి నానిని గెలపించారని బుద్దా వెంకన్న అన్నారు.
కాగా, విజయవాడ ఎంపీ టికెట్‌ను నానికి కాదని ఆయన తమ్ముడు చిన్నికి చంద్రబాబు కేటాయించారు. దీంతో నాని టీడీపీలో ఎప్పటినుంచో అసంతృప్తిగా ఉండగా.. ఇటీవల పార్టీని వీడి వైసీపీ గూటికి చేరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని చూస్తున్నారు. నానికి జగన్ సైతం టికెట్ ఇంకా ఫిక్స్ చేయలేదు.