Kodangal Development CM Revanth Reddy: కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక అథారిటీలు ఏర్పాటు చేస్తూంటారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఉనికిలోకి వచ్చింది.
దీనికి వికారాబాద్ జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ అథారిటీకి వెంటనే స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. మౌళిక వసతులు, విద్యా, ఆరోగ్య రంగాల్లో నిర్ధేశిత లక్ష్యాలను చేరుకోవడం, యువతకు ఉపాధి అవకాశాల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు వంటి ప్రోగ్రామ్‌లను ఇక్కడ ప్రత్యేకంగా చేపట్టనున్నారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి వికారాబాద్ జిల్లా కొడంగల్‌ను ప్రధాన కేంద్రంగా కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కాడా) ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, వికారాబాద్ యొక్క మొత్తం నియంత్రణలో పనిచేయడానికి.. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయడానికి, ప్రాంత అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాల కలయిక కోసం ప్రణాళికలను రచిస్తుంది.
కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ విధులు :
# సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్లు, నీటి సరఫరా పథకాలు, విద్యుద్దీకరణ, వీధి దీపాలు వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల పనులు/పథకాలు చేపట్టడం.
# ఉత్పాదకత పెంపుదల కోసం వినూత్న జీవనోపాధి కార్యక్రమాలను చేపట్టడం, నైపుణ్యాన్ని పెంచే స్థాయికి అనుసంధానించబడిన ఉపాధి కల్పన కార్యకలాపాలకు శిక్షణ ఇవ్వడం.
# ఆరోగ్యం వంటి సామాజిక అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన,
# కావలసిన లక్ష్యాలను సాధించడానికి విద్య మొదలైనవి.
# నేల, భూగర్భ జలాలు వంటి అన్ని సహజ వనరులను వాంఛనీయ స్థాయిలకు సమర్థవంతంగా ఉపయోగించడం.
# స్థిరమైన వ్యవసాయ అభివృద్ధిని నిర్ధారించడానికి నీటి సంరక్షణ పనులు/పథకాలను చేపట్టడం.
# అనువైన పరిశ్రమలను ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను స్థాపించడం మరియు ప్రోత్సహించడం.
కొడంగల్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి మూడో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆయన ఇంతకు ముందు వరకూ ప్రతీ సారి ప్రతిపక్షంలోనే ఉన్నారు. మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు.. తర్వాత ఉద్యమ సమయంలోనూ ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఈ కారణంకా భారీ అభివృద్ధి చేపట్టలేకపోయారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బస్ డిపో సహా అనేక పనులు చేయించారు. చాలా వరకూ సొంత నిధులతో కొడంగల్ ను అభివృద్ధి చేయించారు. ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి కావడంతో కొడంగల్ ను .. పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అధారిటీ ద్వారా ప్రజలు కోరుకున్న అభివృద్ధిని చేయగలనని ఆయన భావిస్తున్నారు.