Telangana News: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కారు ప్రత్యామ్నాయ పంటల దిశగా అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేయాలని అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులను ఆదేశించింది. ఈ నెలాఖరు వరకు వర్షపాతాన్ని పరిశీలించి.. సదరు ప్రణాళిక అమలుపై తుది నిర్ణయం తీసుకుంటామని వివరించింది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ లో తీవ్ర వర్షాభావ పరిస్థితులే నెలకొనగా.. జులైలోనూ ఇప్పటి వరకు పెద్దగా మార్పులేదు. అక్కడక్కడా చిరు జల్లులు, ఓ మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ..  పెద్దగా మార్పులేదు. అక్కడక్కడా చిరు జల్లులు, ఓ మోస్తరు వర్షాలు మినహా భారీ వర్షాలు, అతిభారీ వర్షాల జాడ లేదు. దాదుపు 23 జిల్లాల్లో 20 నుంచి 51 శాతం వరకూ లోటు వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లోనూ పలు మండలాల్లో వర్షం జాడే లేదు. పంటల సాగుకు అదును దాటి పోతుండగా.. సీజన్ పై ఆధార పడ్డ ఇతర రంగాలు సైతం వర్షాల కోసం దిక్కులు చూస్తున్నాయి.


ఈసారి ఎల్నినో ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితులు కరవుకు సంకేతమని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రంలోనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యవసాయ శాఖతో పలు దఫాలు సమావేశాలు నిర్వహించింది. అనంతరం అన్ని జిల్లా వ్యవసాధాకారులకు అత్యవసర ప్రణాళిక రూపకల్పనపై ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ప్రభుత్వం ఓ నమూనాను కూడా ఇచ్చింది. దీని ప్రకారం జిల్లాల వారీగా వ్యవసాయ భూములు, నేలల స్వభావం, సాధారణ పంట విస్తీర్ణాలు, వర్షపాతం, భూగర్భ జలాలు, వేసిన పంలు, వర్షం లోటుతో కల్గిన నష్టాలను నివేదిస్తారు. అలాగే ఈనెల 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పటల నమోదును వ్యవసాయ శాఖ ప్రారంభించింది. ఈ నివేదిక సైతం నెలాఖరు వరకు ప్రభుత్వానికి చేరనుంది. వీటి ఆధారంగా అత్యవసర ప్రణాళికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 


ప్రభుత్వమే ఉచితంగా విత్తనాలు పంపిణీ చేస్తుంది..!


అత్యవసర ప్రణాళికను ప్రకటించిన తర్వాత ఆయా భూముల్లో ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు అవసరం అయిన విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వమే పంపిణీ చేస్తుంది. పెసలు, పచ్చజొన్న, సజ్జలు, మినుములు, పొద్దు తిరుగుడు, నువ్వులు, ఆముదం, తదితర పంటల విత్తనాలు ఇందులో ఉంటాయి. కరవు దృష్ట్యా పశుగ్రాసం నిల్వలు, సరఫరా కొరత లేకుండా తాగునీటి సరఫరాకు చర్యలను ప్రత్యామ్నాయ ప్రణాళికలో నిర్దేశిస్తారు. గతంలో 2009-10లో తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడగా.. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఇక్కడి అన్ని జిల్లాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించి అత్యవసర ప్రణాళికలు అమలు చేసింది. 


376 మండలాల్లో వర్షపాతం, 39 మండలాల్లో అతితీవ్రం


తెలంగాణలో 23 జిల్లాల్లో కురవాల్సిన వానకంటే తక్కువగా కురవగా.. పది జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు అయింది. ఆ పది జిల్లాల్లోనూ కొన్ని మండలాల్లో వర్షపాతం లోటు ఎక్కువగా ఉంది. మొత్తం 612 మండలాలకు గాను.. 376 మండలాల్లో వర్షపాతం నమోదు అయింది. ఇందులో 39 మండలాల్లో లోటు అతి తీవ్రంగా ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. కురవాల్సిన వర్షం కంటే 20 నుంచి 59 శాతం వరకు తక్కువ పడితే లోటు గాను 60 నుంచి 99 శాతం వరకు తక్కువ కురిస్తే తీవ్రమైన లోటుగా పరిగణిస్తారు. జూన్ 1 నుంచి జులై 11వ తేదీ వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 197.5 మి.మీ కాగా, 150.4 మి.మీ కురిసింది. దీని ప్రకారం చూస్తే రాష్ట్రం మొత్తం మీద లోటు 24 శాతం మాత్రమే. కానీ మండలాల వారీగా చూసినప్పుడు 60 శాతానికి పైగా మండలాల్లో లోటు, ఎక్కువ లోటు ఉండడం ఆందోళన కల్గిస్తోంది.