CM Revanth Decided to Implementation of Another Two Schemes: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మరో 2 గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో గృహజ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు ముహూర్తం దాదాపు ఫిక్స్ చేశారు. ఈ 2 పథకాలు ఈ నెల 27 లేదా 29న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధి విధానాలపై భేటీలో కీలకంగా చర్చించారు. గ్యాస్ ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు. సబ్సిడీ ఎలా అందించాలనే అంశంపైనా చర్చించారు. 


కీలక ఆదేశాలు


కేబినెట్ సబ్ కమిటీ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో అర్హులందరికీ రూ.500కు గ్యాస్ సిలిండర్ అందించాలని అన్నారు. సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా, లేదా ఏజెన్సీలకు చెల్లించాలా.? అనే విషయంపైనా చర్చించారు. అనుమానాలు, అపోహలకు తావు లేకుండా పథకాలు అమలు చేయాలని నిర్దేశించారు. అలాగే, గృహ జ్యోతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలన్నారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్ బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ ఈ పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సూచించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్లలోపు గృహ విద్యుత్ వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింప చేయాలని స్పష్టం చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో రేషన్ కార్డు నెంబర్, విద్యుత్ కనెక్షన్ నెంబర్ తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారు ఉంటే.. అలాంటి వారికి తప్పులు సవరించుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. అలాగే, ప్రజాపాలన దరఖాస్తు నిరంతర ప్రక్రియగా కొనసాగాలని.. పథకాలకు దరఖాస్తు చేసుకోని వారి కోసం ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో అప్లై చేసుకునే అవకాశం కల్పించాలని ఆదేశించారు.


విద్యుత్ అధికారులపై ఆగ్రహం


రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్ ను ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్ కోతలు విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పెరిగిందని చెప్పారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపేసిన సంఘటనలపై ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. 'ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు, విద్యుత్ పై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అటువంటి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గ‌తంతో పోల్చితే విద్యుత్ స‌ర‌ఫ‌రా పెంచినప్పటికీ,  కోత‌లు పెడుతున్నారంటూ జరుగుతున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మీదే' అని విద్యుత్ శాఖ అధికారులకు సీఎం స్పష్టం చేశారు.


Also Read: Thummala Nageswara Rao 'సన్ ఫ్లవర్ రైతులు తొందరపడొద్దు' - కనీస మద్దతు ధరపై మార్క్ ఫెడ్ అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు