Kothapally Subbarayudu has announced that he will join the Jana Sena : జనసేనలో చేరుతానని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు. గురువారం ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్వప్రయోజనాల ఆశించకుండా రాష్ట్ర, దేశ భవిష్యత్తు కోసం ఆలోచించే, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చడంతో జనసేన లో చేరుతానని చెప్పారు. పవన్ కల్యాణ్ గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి యువతకు ఆరాధ్య నాయకుడని అన్నారు. ఆయన సొంత సొమ్ము వెచ్చించి కౌలు రైతులకుఆర్ధిక సహాయం అందిచరన్నారు.రాజధాని అమరావతి విషయంలో ఆయన పోరాటం ఎనలేనిదన్నారు. రైల్వే జోన్, ప్రత్యేక హౌదా కోసం నిర్మొహమాటంగా పోరాటం చేశారన్నారు.
టీడీపీ నుంచి ప్రజారాజ్యం, వైసీపీ నుంచి జనసేనలోకి కొత్తపల్లి
1989, 94, 99, 2004లో టీడీపీ నుంచి, 2012లో కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి మంత్రిగానూ పనిచేశారు. అయితే 2009లో పీఆర్పీ నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ముదునూరి ప్రసాద రాజు చేతిలో ఓడిపోయారు. 2014లో సుబ్బారాయుడు తిరిగి టీడీపీలో చేరారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా పని చేసారు. ఆ తరువాత 2019లో వైసీపీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజుతో విభేదాల కారణంగా పార్టీ వీడారు. గతంలో ప్రజారాజ్యంలో పని చేసిన సమయం నుంచి ఉన్న సంబంధాలతో ఇప్పుడు తిరిగి జనసేనలో చేరాలని సుబ్బారాయుడు నిర్ణయించారు.
నర్సాపురం అసెంబ్లీ సీటు ఆశిస్తున్న సు బ్బారాయుడు
కొత్తపల్లి సుబ్బారాయుడు నర్సాపురం నుంచి సీటు ఆశిస్తున్నారు. ఇప్పటికే అక్కడ పార్టీ నేత బొమ్మిడి నాయకర్ జనసేన అభ్యర్దిగా ప్రచారంలో ఉన్నారు. టీడీపీ నుంచి మాధవ నాయుడు, ఎన్నారై కొవ్వలి నాయుడు పోటీ కోసం రేసులో ఉన్నారు. ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకు వెళ్తుందని చెబుతున్నారు.ఇప్పుడు తాజాగా సుబ్బారాయుడు ఎంట్రీతో సీటు పైన చర్చ మొదలైంది. అదే విధంగా విశాఖ, తూర్పు గోదావరిలో పవన్ తమ పార్టీకి దక్కే సీట్లుగా చెప్పిన నియోజకవర్గాల్లో టీడీపీ సీనియర్లు ఉన్నారు. తమ పార్టీ నాయకత్వంతో జనసేనకు కేటాయించే సీట్ల పైన స్పష్టత కోరుతున్నారు.
కొత్తగా చేరే వారికి టిక్కెట్లు లేవంటున్న జనసేన వర్గాలు
పార్టీ నుంచి అధికారికంగా నిర్ణయం వచ్చిన తరువాత తమ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొత్తగా చేరే వారికి పార్టీ టిక్కెట్లు ఇవ్వదని జనసేన వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. కొత్తపల్లి సుబ్బారాయుడు టిక్కెట్ షరతు పెట్టి పార్టీలో చేరితే పవన్ ఆహ్వానించరని అంటున్నారు. మొత్తంగా ఉభయగోదావరి జిల్లాల్లో అత్యధిక మంది నేతలు కూటమి దగ్గరకు చేరుతున్నారు.