Congress Vs BJP: లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. తమ బ్యాంక్ అకౌంట్‌లలోని డబ్బుల్ని లాక్కునేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మండి పడింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేసీ వేణుగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీల గొంతుని అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశాన్ని తామూ పరిపాలించామని, ఈ విషయం గుర్తుంచుకోవాలని వెల్లడించారు. 


"మా బ్యాంక్ అకౌంట్స్ నుంచి బీజేపీ డబ్బులన్నీ లాక్కోవాలని చూస్తోంది. మేమూ ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించామని గుర్తుంచుకోండి. యూపీఏ, కాంగ్రెస్ హయాంలో బీజేపీ ఎప్పుడైనా ఇలాంటి సమస్య ఎదుర్కొందా అనేది ఓ సారి పరిశీలించుకోవాలి. ప్రజాస్వామ్యంపై బీజేపీ దాడి చేస్తోంది. మా విలువపై జరుగుతున్న దాడి ఇది. ప్రతిపక్ష పార్టీల గొంతుని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం నియంతృత్వ పాలనకు ఉదాహరణ"


- కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ సీనియర్ నేత 


 






కాంగ్రెస్‌కి కార్యకర్తల నుంచి వచ్చిన డబ్బుని బీజేపీ ఇలా లాగేసుకోవడం దారుణమని ఆ పార్టీ మండి పడుతోంది. అంతే కాదు. రూ.65.89 కోట్లను కేంద్ర ప్రభుత్వం బలవంతంగా తమ బ్యాంక్ ఖాతాల నుంచి తమకు ట్రాన్స్‌ఫర్ చేయించుకుందని ఆరోపించింది. ఇదంతా AICCతో పాటు యూత్‌ కాంగ్రెస్,NSUI బ్యాంక్ అకౌంట్స్‌లలోని డబ్బులని స్పష్టం చేసింది.






కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాల్ని స్తంభింపజేయడం ఒక్కసారిగా అలజడి సృష్టించింది. తమను కావాలనే టార్గెట్ చేసి ఐటీ శాఖ ఇలా ఆంక్షలు విధించిందని మండి పడింది కాంగ్రెస్ పార్టీ. ట్యాక్స్ ట్రిబ్యునల్‌లో (Tax Tribunal) న్యాయ పోరాటం చేసింది. మొత్తానికి ఈ పోరాటంలో కాస్త ఊరట లభించింది. ఖాతాలు ఫ్రీజ్ అయినప్పటికీ వాటిని పార్టీ వినియోగించుకోవచ్చని ట్రిబ్యునల్ వెల్లడించింది. ఆ ఖాతాలపై ఐటీశాఖకు న్యాయపరమైన హక్కులు మాత్రమే ఉంటాయని, వాటిని ఆపరేట్ చేసుకోడానికి ఎలాంటి ఆంక్షలు ఉండవని తేల్చి చెప్పింది. ఈ తీర్పు ఇవ్వక ముందు కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసింది. లోక్‌సభ ఎన్నికల ముందు కావాలనే ఇలా చేశారమని మండి పడింది.