Rahul Gandhi Comments on Aishwarya Rai: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బాలీవుడ్‌ సీనియర్ నటి, ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో భారత్ జోడో న్యాయ్‌యాత్ర కొనసాగుతోంది. ఆ సమయంలోనే అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం గురించి ప్రస్తావించారు. ఈ వేడుకకు ఆహ్వానం అందిన వారి గురించి మాట్లాడుతూ...OBCలు, దళితులను అసలు పట్టించుకోలేదని విమర్శించారు. దేశ జనాభాలో 73% జనాభా ఉన్న ఆ వర్గాలనే అంత ముఖ్యమైన వేడుకకు ఆహ్వానించలేదని మండి పడ్డారు. అంతే కాదు. బిలియనీర్‌లు, బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకల్లో హాజరు కావడంపైనా విమర్శలు గుప్పించారు. వాళ్లలో ఒక్కరైనా OBC కనిపించారా అంటూ ప్రశ్నించారు. ఆ సమయంలోనే ఐశ్వర్యా రాయ్‌పై చేసిన కామెంట్స్‌ సంచలనమయ్యాయి. 


"రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని గమనించారా..? ఆహ్వానితుల్లో ఎవరైనా OBCలు, దళితులు కనిపించారా..? అమితాబ్‌ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, నరేంద్ర మోదీ తప్ప ఇంకెవరైనా ఉన్నారా..? టీవీ ఛానళ్లు అన్నీ ఐశ్వర్యా రాయ్‌ని తప్ప ఇంకెవరినీ చూపించవు. వాళ్లకు పేదల సంగతే అక్కర్లేదు" 


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 



రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర విమర్శలు చేశారు. సింగర్ సోనా మొహపాత్ర మండి పడ్డారు. ప్రధాని మోదీ సహా ఐశ్వర్యా రాయ్‌పై అనుచిత వ్యాఖ్యల్ని చేయడాన్ని తప్పుబట్టారు. వరుస పెట్టి X వేదికగా పోస్ట్‌లు పెట్టారు. 


"రాజకీయ నాయకులు తమ స్పీచ్‌లలో ఇలా మహిళల గురించి అనుచితంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. రాహుల్ గాంధీజీ...గతంలో మీ తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ గురించి కూడా కొందరు ఇలాగే మాట్లాడారు. బహుశా మీకు గుర్తుండే ఉంటుంది"


- సోనా మొహపాత్ర, సింగర్