Telangana Government Approved KUDA Master Plan: ఉమ్మడి వరంగల్ జిల్లాకు (Warangal District) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) - 2041 మాస్టర్ ప్లాన్‌ను ఆమోదించడం సహా.. మామునూరు విమానాశ్రయానికి (Mamnoor Airport) అవసరమైన అదనపు భూ సేకరణకు రూ.205 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు బృహత్ ప్రణాళికకు సంబంధించి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ జీవో జారీ చేశారు. సర్కారు సోమవారం గెజిట్ సైతం ప్రచురించింది. వరంగల్, కాజీపేట, హనుమకొండ, అలాగే ఈ మూడింటి సమీపాన ఉన్న 181 రెవెన్యూ గ్రామాల్లో కలిపి మొత్తం 1,805 చదరపు కిలోమీటర్లు ఈ మాస్టర్ ప్లాన్ పరిధిగా నిర్ణయించారు.


మామునూరు ఎయిర్‌పోర్టుపై ముందడుగు


అటు, వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి చేపట్టనున్న పనుల్లో మరో ముందడుగు పడింది. ఎయిర్‌పోర్టుకు అదనంగా అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఈ ప్రాజెక్టును నిర్వహిస్తుంది.



  • ఇప్పటికే విమానాశ్రయ పరిధిలో 696 ఎకరాల భూమి ఉంది. అయితే, ఏఏఐ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయనున్న విమానాశ్రయానికి మరో 280.30 ఎకరాల స్థలం అవసరమని గుర్తించింది. ఈ క్రమంలో ప్రభుత్వం 253 ఎకరాలను రైతుల నుంచి సేకరించింది. మిగతాది ప్రభుత్వ భూమి.

  • డెవలప్‌మెంట్ ప్లాన్: ఇన్‌స్ట్రుమెంట్ ఫ్లైట్ రూల్స్ (IFR) సామర్థ్యాలతో A - 320 టైప్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్యకలాపాల కోసం మామునూరు ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏఏఐ ఓ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో అవసరమైన మౌలిక సదుపాయాలు, కార్యాచరణ సౌకర్యాలు ఉన్నాయి. భూసేకరణ ప్రక్రియ కోసం రూ.205 కోట్లు మంజూరు చేయగా కలెక్టర్ ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

  • రాజీవ్ గాంధీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (RGHIAL) అక్టోబర్ 23, 2024న బోర్డ్ మీటింగ్ సందర్భంగా మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్వహణ కోసం NOC జారీ చేసింది. ఇది ఎలాంటి పరిమితులు లేకుండా అభివృద్ధిని కొనసాగించడానికి అనుమతిస్తుంది. విమానాశ్రయం మౌలిక సదుపాయాలు, కార్యకలాపాలు, నిర్వహణ ఖర్చులను ఏఏఐ భరిస్తుంది.

  • రాష్ట్రంలోని 6 ప్రాంతీయ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో భాగంగా మామునూరు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాంతంలో ఎయిర్ కనెక్టివిటీని పెంపొందించడానికి భూసేకరణ, నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వరంగల్ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రధాన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, సకాలంలో పురోగతి సాధించేందుకు ఏఏఐతో సమన్వయం చేసుకోవాలని జిల్లా కలెక్టర్, వరంగల్‌ను ఆదేశించారు.


కాగా, 'కుడా' మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం తెలిపిన క్రమంలో ఆ ప్రాంత పరిధిలో భవన నిర్మాణాలకు అడ్డంకులు తొలగనున్నాయి. ప్రాంతీయ, ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణాలు వేగంగా జరిగేందుకు అవకాశం ఏర్పడింది. చెరువులు, నాలాల పునరుద్ధరణ పనులు సహా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. మరోవైపు, జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ డివిజినల్ లెవల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.26 కోట్లు మంజూరు చేసింది. అలాగే, గ్రేటర్ వరంగల్ పరిపాలన టవర్ల నిర్మాణానికి రూ.32.50 కోట్లు కేటాయించింది.


Also Read: Hyderabad Tourism News: వీకెండ్‌లో రామప్ప, లక్కవరం టూర్‌- తెలంగాణ పర్యాటక శాఖ స్పెషల్ ప్యాకేజీ