6 Lakhs To Dalit Houses In Indiramma Housing Scheme: పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. సోమవారం 'ఇందిరమ్మ ఇళ్ల పథకం'ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భద్రాచలంలో ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులకు ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా దళితులు, గిరిజనులకు మరో రూ.లక్ష అదనంగా.. ఇంటి నిర్మాణానికి మొత్తం రూ.6 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఇళ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని.. ప్రతీ నియోజకవర్గానికి 3,500 చొప్పున అర్హులందరికీ ఇళ్లు రాబోతున్నాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లుగా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. 'రాష్ట్ర ప్రజల బాధ చూసే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఇచ్చిన హమీలను 90 రోజుల్లోగా అమలు చేస్తున్నాం. సొంతింటి కల సాకారం కోసం ప్రజలు పదేళ్లుగా ఎదురు చూశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాం.' అని  భట్టి పేర్కొన్నారు.


భద్రాచలం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక


భద్రాచలం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఆలయ అభివృద్ధికి నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు ఇస్తామని చెప్పి.. మోసం చేశారని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో పేదలను మోసం చేశారని ధ్వజమెత్తారు. గోదావరిపై వంతెన, మంచినీటి సదుపాయం, భద్రాచలం అభివృద్ధికి పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అలాగే, గత ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్లకు సైతం త్వరలోనే పట్టాలిస్తామని అన్నారు.


నాలుగు దశల్లో ఆర్థిక సాయం


లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం 4 దశల్లో ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది.


 బేస్ మెంట్ స్థాయిలో రూ.లక్ష


 రూఫ్ (పైకప్పు) స్థాయిలో రూ.లక్ష


 పైకప్పు నిర్మాణం తర్వాత రూ.2 లక్షలు


 ఇంటి నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష అందించనున్నారు. ప్రతి దశలోనూ అధికారులు పరిశీలన అనంతరం డబ్బు మంజురు చేస్తారు.


వీరే అర్హులు


 దారిద్ర్య రేఖకు (బీపీఎల్) దిగువన ఉన్న వారు, ఆహార భద్రత కార్డు ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది.


 లబ్ధిదారునికి సొంత స్థలం ఉండాలి. లేదా ప్రభుత్వ స్థలం ఇచ్చి ఉండాలి.


 గ్రామం లేదా పురపాలిక పరిధి వారై ఉండాలి


 గుడిసె ఉన్నా, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్నా ఈ పథకానికి అర్హులు.


 అద్దె ఇంట్లో ఉంటున్నా, వివాహమైనా, ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా లబ్ధిదారుడిగా ఎంపిక కావొచ్చు


 ఒంటరి, వితంతు (విడోవర్) మహిళలూ అర్హులే.


ఇళ్ల మంజూరు ఇలా


 ఇందిరమ్మ ఇంటిని మహిళ పేరు మీదే మంజూరు చేస్తారు. ఇంట్లో వితంతు మహిళలు ఉంటే ఆమె పేరు మీదే ఇస్తారు.


 గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాతే లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు.


 ఆ జిల్లా ఇంఛార్జీ మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు.


 లబ్ధిదారుల జాబితాను గ్రామసభల్లో ప్రదర్శించాకే సమీక్షించి ఖరారు చేస్తారు.


 జిల్లాల్లో కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్ లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను పరిశీలిస్తారు.


 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి. కిచెన్, బాత్రూం సెపరేట్ గా ఉండాలి. ఆర్ సీసీ రూఫ్ తో ఇంటిని నిర్మించాలి.


 లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డు సభల్లో ప్రదర్శిస్తారు.


Also Read: Telangana CM Revanth Reddy: యాదాద్రిలో లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు- పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి