Gobi Manchurian Ban in Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి, గోబీ మంచూరియాలో ఫుడ్ కలర్స్‌ని వినియోగించడంపై నిషేధం విధించింది. Rhodamine-B ఫుడ్ కలరింగ్ ఏజెంట్ వాడకాన్ని నిలిపివేయాలని కర్ణాటక ఆరోగ్య శాఖ ఆదేశించింది. నిషేధం విధించిన తరవాత కూడా ఎవరైనా వినియోగిస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. Food Safety Act కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. చాలా చోట్ల ఈ ఫుడ్ ఐటమ్స్‌ నాణ్యంగా ఉండడం లేదని అసహనం వ్యక్తం చేసింది. ఆర్టిఫిషియల్ కలరింగ్ కారణంగా ఇవి హానికరంగా తయారవుతున్నాయని తెలిపింది. 171 గోబి మంచూరియా శాంపిల్స్ సేకరించి పరీక్షించగా అందులో 64 మాత్రమే ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నాయని, 106 నమూనాల్లో హానికర రసాయనాలు కనిపించాయని స్పష్టం చేసింది. ఇక 25 కాటన్ క్యాండీ శాంపిల్స్ సేకరించి పరీక్షించగా...15 శాంపిల్స్ ప్రమాదకరంగా ఉన్నాయని తేలింది. ఈ శాంపిల్స్‌లో Rhodamine-1B తో పాటు Sunset Yellow, Carmoisine, Tartrazine లాంటి కృత్రిమ రంగులు ఈ శాంపిల్స్‌లో కనిపించాయని అధికారులు వెల్లడించారు. 






"హోటల్స్, రోడ్డు పక్కనే ఉన్న షాప్‌లతో పాటు మరి కొన్ని చోట్ల నుంచి ఈ శాంపిల్స్‌ని సేకరించాం. వాటిలో చాలా వరకూ ప్రమాదకరంగానే ఉన్నాయి. ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్‌ అందులో కలుపుతున్నారు. రంగురంగులుగా కనిపించేందుకు వీటిని జోడిస్తున్నారు. ఇక నుంచి ఈ కలర్స్‌ కలపడాన్ని నిషేధిస్తున్నాం. ఎవరైనా మళ్లీ ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం"


- దినేశ్ గుండు రావు, కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి


ఇప్పటికే తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో పీచు మిఠాయి ఉత్పత్తి, విక్రయాలపై ఆంక్షలు విధించారు. అందులో కెమికల్స్ ఎక్కువగా కలుపుతున్నారని తెలిసిన వెంటనే నిషేధించారు. ఈ కెమికల్ కారణంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫుడ్‌ సేఫ్‌టీ డిపార్ట్‌మెంట్ అధికారులు పీచు మిఠాయి శాంపిల్స్‌ని సేకరించి టెస్ట్‌ చేయగా అందులో హానికర రసాయనాలున్నట్టు తేలింది. త‌మిళ‌నాడు ఆహార భద్రతా శాఖ వెల్ల‌డించిన వివ‌రాల మేర‌కు `రొడమైన్ బి` రసాయం జౌళి రంగానికి సంబంధించిన వృత్తిలో వినియోగిస్తారన్నారు. అంటే దుస్తుల‌ను వివిధ రంగుల్లోకి మార్చేందుకు ఈ ర‌సాయ‌నాన్ని వాడ‌తారు. వీటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఆహారంగా తీసుకోకూడ‌దు. అయితే.. ఈ విష‌యం తెలియ‌క‌.. వీధి వ్యాపారులు ఈ రసాయనాన్ని పీచు మిఠాయిలో వినియోగిస్తున్నారని తెలిపారు. 


సాధార‌ణంగా పీచు మిఠాయి(Peach candy)ని.. పంచ‌దార‌(Sugar)తోనే త‌యారు చేస్తారు. రెండో ప‌దార్థం వినియోగించ‌రు. అయితే.. వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించేందుకు ప‌లు ర‌కాల రంగులు(Colours) క‌లుపుతారు. త‌ద్వారా.. పీటు మిఠాయి ఎంతో ఆక‌ర్ష‌ణ‌గా ఉండి.. చూడ‌గానే నోరు ఊరించేలా చేస్తుంది. ఇది తియ్యగా, నోటిలో వేసుకొంటే కరిగిపోయే స్థితి ఉండడంతో పిల్లలు, యువతీ యువకులు వీటిని తినేందుకు ఇష్టపడుతుంటారు. పెద్ద‌లు కూడా దీనిని తినేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. 


Also Read: సిగరెట్‌ల కన్నా బీడీలు 8 రెట్లు ప్రమాదకరం, సంచలన విషయం చెప్పిన నిపుణులు