Bidi Smoking Dangerous: సిగరెట్‌ల కన్నా బీడీలు తాగితేనే ఎక్కువ ప్రమాదకరం అని ఇటీవలి ఓ అధ్యయనం సంచలన విషయం వెల్లడించింది. ఆకులతో తయారు చేసిందే కదా...పెద్దగా హానికరం కాదు అని అనుకున్నా...సిగరెట్‌ల కన్నా ఇవే డేంజర్ అంటూ ఈ రిపోర్ట్ తేల్చి చెప్పింది. ఈ బీడీ ఆకులు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని తెలిపింది. లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో నిపుణులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా మార్చి 13వ తేదీన "No Smoking Day" నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన ఈవెంట్‌లోనే నిపుణులు పొగ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై చర్చించారు. ఆ సమయంలోనే బీడీల ఎఫెక్ట్ గురించి మాట్లాడారు. తక్కువ ధరకే వస్తుండడం వల్ల అల్పాదాయ వర్గానికి చెందిన వాళ్లు వీటిని ఎక్కువగా వాడుతున్నారని చెప్పారు. సిగరెట్‌లు, బీడీలను పోల్చి చూస్తే...రెండూ ఆరోగ్యానికి హానికరమే అయినా...బీడీలు ఇంకాస్త ఎక్కువ ముప్పు తెచ్చి పెడతాయని స్పష్టం చేశారు. ఆకులతో తయారు చేసిన బీడీలు కాల్చినప్పుడు ఎక్కువ మొత్తంలో పొగ గాల్లోకి విడుదలవుతుందని, అది శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తుందని తేల్చి చెప్పారు. బీడీ తాగినప్పుడు చాలా మంది గట్టిగా పీల్చుకుంటారని, ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులు పాడైపోతాయని వివరించారు.  


ఇ-సిగరెట్లతోనూ ప్రమాదమే..


సిగరెట్‌లతో పాటు ఈ మధ్య ఇ-సిగరెట్‌ల వాడకమూ పెరిగిపోయింది. ప్రభుత్వాలు వీటిపై ఆంక్షలు విధిస్తున్నా గుట్టుచప్పుడు కాకుండా వాటిని సప్లై చేసేస్తున్నారు. నేపాల్ నుంచి పెద్ద ఎత్తున ఇవి స్మగుల్ అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. నోయిడా, ఢిల్లీ పోలీసులు కొన్ని చోట్ల ఈ ముఠాలను పట్టుకున్నారు. ఇ-సిగరెట్‌లు పీల్చితే అవి ఊపిరితిత్తులపై చాలా తొందరగా ప్రభావం చూపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. టొబాకో వినియోగించే వారిపై భారీ జరిమానాలు విధించాలని సూచించింది. ధూమపానానికి ఎంతో మంది బానిసలుగా మారడానికి కారణం అందులోని నికోటిన్. ఒక్కసారి దానికి అలవాటు పడితే విడిచిపెట్టడం కష్టం. నికోటిన్ అనేది సిగరెట్ లో ఉండే ఒక పదార్థం. మెదడు మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రక్తనాళాలని ఇరుకు చేస్తుంది. రక్తపోటు, గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతుంది. మెదడు నికోటిన్ కి బానిసగా మారిపోయి హానికరమైన అలవాట్లకి విడిచిపెట్టలేకపోతారు. అందుకే అది వ్యసనమైపోయి చివరకు ప్రాణాలు బలి తీసుకుంటోంది. 


బీడీలు ఎందుకంత ప్రమాదకరం..?



  • సాధారణ సిగరెట్‌లతో పోల్చి చూస్తే బీడీల్లో నికోటిన్ 3-5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 

  • సిగరెట్‌లలో కన్నా బీడీల్లో కార్బన్‌మోనాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. 

  • బీడీల్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు. అందుకే శరీరంలోకి ఎక్కువ మొత్తంలో టాక్సిన్‌లు వెళ్తాయి. 

  • బీడీలు అతిగా తాగడం వల్ల గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 

  • సిగరెట్‌లు తాగే వాళ్లతో పోల్చి చూస్తే బీడీలు తాగే వాళ్లలు గుండెపోటు వచ్చే ప్రమాదం మూడు రెట్లు అధికంగా ఉంటుంది. 


Also Read: ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు రేపటిలోగా ఇవ్వాల్సిందే - SBIకి సుప్రీంకోర్టు ఆదేశం