PM Modi Inaugurates Integrated Terminal T3: ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh) రాజధాని లక్నో(Lucknow)లోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయ(Chaudhary Charan Singh International Airport)లో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ T3ని ప్రారంభించారు ప్రధానమంత్రి. 2400 కోట్ల రూపాయలతో నిర్మించిన T3 దేశీయ, అంతర్జాతీయ విమానాలకు సేవలు అందించనుంది. రద్దీ సమయాల్లో 4,000 మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. మొదటి దశలో సంవత్సరానికి 8 మిలియన్ల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరవేయనుంది. ఎలివేటెడ్ పాత్‌వేలు రాకపోకలను సులభతరం చేస్తాయి. ఫేజ్ 2 సంవత్సరానికి 13 మిలియన్ల మంది ప్రయాణికులను హ్యాండ్లింగ్ చేసే కెపాసిటీ కలిగి ఉంది. 


దూరదృష్టికి నిదర్శనం


ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ T3 ప్రారంభోత్సవం సందర్భంగా అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ(Karan Adani) మాట్లాడుతూ,"CCSIA విషయంలో మేము చాలా విస్తృత ప్రయోజనాలతో,  దూరదృష్టితో ఆలోచించాం. 2047-48 నాటికి 38 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించేలా విమానాశ్రయ సామర్థ్యాన్ని విస్తరించడమే  లక్ష్యంగా ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించాం. ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే ఉత్తరప్రదేశ్ ఆకాంక్షకు మద్దతునిచ్చే వ్యూహంలో ఇదో మూలస్తంభం. మేము కేవలం మౌలిక సదుపాయాలను మాత్రమే ఏర్పాటు చేయడం లేదు– ప్రత్యక్షంగా పరోక్షంగా 13,000 ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తున్నాం. తద్వారా రాష్ట్ర ఆర్థిక పురోగతికి సాయం చేస్తున్నాం. 



ఉత్తర్‌ప్రదేశ్‌ అభివృద్ధికి గేట్‌వే


ఈ కొత్త టెర్మినల్ ఉత్తరప్రదేశ్‌కు గేట్‌వేగా మారుతుంది. T3 ద్వారా ప్రపంచ స్థాయి విమానాశ్రయాన్ని నిర్మించడమే కాకుండా, ఉత్తరప్రదేశ్‌కు గర్వకారణంగా మార్చాలనుకుంటున్నాం. మనం కలిసి పని చేస్తే ఎన్ని అద్భుతాలు చేయగలమో అనేదానికి ఇది సరైన నిదర్శనం. పర్యావరణ సుస్థిరత పట్ల కూడా బాధ్యతల వ్యవహరిస్తున్నాం. భవిష్యత్ తరాలకు మన పరిసరాల సహజ సౌందర్యాన్ని కాపాడేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎదుగుదల ఎల్లప్పుడూ మంచితనంతో ఉండాలని మా ఛైర్మన్ గౌతమ్ అదానీ చెప్పే మాటలే మాకు స్ఫూర్తి. 


T3కి ఆధునిక హంగులు 
ఈ టెర్మినల్‌లో ప్రయాణీకుల సౌకర్యార్థం అత్యాధునిక ఫీచర్లు ఏర్పాటు చేశారు. 72 చెక్-ఇన్ కౌంటర్లు ఉన్నాయి. ఇందులో 17 సెల్ఫ్‌ బ్యాగేజీ డ్రాప్‌ కౌంటర్లు ఉన్నాయి. 62 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఇందులో 27 ఎమిగ్రేషన్, 35 అరైవల్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఉన్నాయి. ఆధునిక లాంజ్‌లు ఈ టెర్మినల్‌కు అదనపు సౌకర్యాలు.


కొత్తగా నిర్మించిన ఆప్రాన్ ప్యాసింజర్ బోర్డింగ్ గేట్‌లు 7 నుంచి 13కి, ప్యాసింజర్ బోర్డింగ్ బ్రిడ్జిలు 2 నుంచి 7కి పెరగనున్నాయి. ప్రస్తుతం ఈ విమానాశ్రయం 24 దేశీయ 8 అంతర్జాతీయ విమానాశ్రయాలతో కనెక్టివిటీ ఉంది. డిజియాత్ర, సెల్ఫ్‌ సర్వీస్‌ కియోస్క్‌లు, ఆటోమేటెడ్ ట్రే రిట్రీవల్ సిస్టమ్‌, లేటెస్ట్ బ్యాగేజ్ స్క్రీనింగ్ మెషీన్‌లు ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. 


అడుగడుగునా అద్భుతం 


ఎంట్రీ గేట్‌ నుంచి స్కైలైట్ వరకు ఉత్తరప్రదేశ్ ఆర్ట్‌ అండ్‌ ఆర్కిటక్చర్‌ ఆడియో వీడియోలు ప్రయాణికులకు కొత్త అనుభూతిని అందించనున్నాయి. చెక్-ఇన్ కౌంటర్ల వద్ద ఉన్న 'చికంకారి' 'ముకైష్' ఎంబ్రాయిడరీ ప్రయాణీకులను మెస్మరైజ్ చేస్తాయి. రామాయణం మహాభారతం వంటి ఇతిహాసాల కథలను వర్ణిస్తూ ఉండే గ్రాఫిక్స్‌ మరో ఎత్తు.