RRR Ticket Rates : ఆర్ఆర్ఆర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ల రేట్లు(Cinema Tickets Rates) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR) హీరోలుగా రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా మార్చి 25న థియేటర్లలలో విడుదల కానుంది. 'ఆర్ఆర్ఆర్' మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం చిత్ర బృందం ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. సినిమాకి టికెట్ రేట్ల పెంపు కోసం చిత్ర నిర్మాత దానయ్య, డైరెక్టర్ రాజమౌళి ఇటీవల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. ఏపీ(AP) ఇప్పటికే టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఆమోదిస్తూ జీవో విడుదల చేసింది. ఏపీలో ఈ సినిమా టికెట్ రేటును 75 రూపాయల వరకు పెంచుకోవచ్చని తెలిపింది. 



ఐదు షోలకు అనుమతి  


ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ల రేట్ల పెంచుకునేందు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎయిర్ కండీషన్డ్ థియేటర్లు(AC Theatre) ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ల రేట్లపై మొదటి మూడు రోజులు (మార్చి 25-27 వరకు) అదనంగా రూ. 50 పెంచుకోవచ్చని తెలిపింది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు టికెట్ల రేట్లపై అదనంగా రూ.30 పెంచుకోడానికి అనుమతి ఇచ్చింది. ఐమాక్స్(IMAX), మల్లీప్లెక్స్, సింగిల్ థియేటర్లలోని రిక్లైనర్ సీట్లకు మొదటి మూడు రోజులు అదనంగా రూ.100 పెంచుకోవచ్చని, మార్చి 28 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు రూ. 50 పెంచుకోవచ్చని తెలిపింది. నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ల రేట్లలో మార్పులు లేవని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు మొదటి పది రోజులు ఐదు షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 1 వరకు చిత్ర ప్రదర్శన చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసులు అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. పన్నుల మినహాయింపులు, అనుమతులు తాత్కాలికమని ప్రభుత్వం తెలిపింది. 


ఏపీలో టికెట్ల రేట్లు పెంపు


ఆర్.ఆర్.ఆర్ మూవీ టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో విడుదల చేసింది. అన్ని థియేటర్లు ప్రతి టికెట్‌పై రూ.75 ధర పెంచుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం జీవోలో వెల్లడించింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ పేరిట జీవో విడుదల అయింది. సినిమా రిలీజ్ అయ్యే ఈ నెల 25వ తేదీ నుంచి 10 రోజుల పాటు ప్రత్యేక ధరలు అమలు చేసుకోవచ్చని ప్రభుత్వం జీవోలో వివరించింది. టిక్కెట్ ధరలకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలని  ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.