Telangana formation Day : ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే తెలంగాణ అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటోందని అప్పట్లో నిపుణులు విశ్లేషించారు. తెలంగాణలో కరెంట్ ఉత్పత్తి తక్కువ కావడంతో కరెంట్ సమస్య నుంచి అనేక రకాల సమస్యలు వస్తాయని అంచనా వేశారు. కానీ ఎనిమిదేళ్లలో తెలంగాణ అద్భుతంగా పురోగమించింది. నీతి ఆయోగ్ అర్థనీతి పేరుతో విడుదల చేసిన నివేదికల్లో తెలంగాణ అభివృద్ధి స్వరూపం కళ్ల ముందు ఉంటుంది.
విడిపోయిన తర్వాత తెలంగాణ అనూహ్య ప్రగతి
తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినప్పటి నుంచి అనూహ్యమైన ప్రగతిని సాధించింది. 2015 -16 ఆర్థిక సంవత్సరం నుంచి వార్షిక వృద్ధి రేటు 11 శాతం కంటే ఎక్కువగా ఉంది. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అంటే.. ఉమ్మడిగా ఉన్న ఆ ఆర్థిక సంవత్సరం మినహా మిగిలిన ఆర్థిక సంవత్సారాల్లో ఆర్థిక వృద్ధి 11 శాతానికి పైగా ఉంది. రాష్ట్రం విడిపోక ముందే తెలంగాణలో తొమ్మిది శాతాని కంటే తక్కువగానే వృద్ధి రేటు ఉండేదని లెక్కలు చెబుతున్నాయి. అంతే కాకుండా… అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని నీతిఆయోగ్ తేల్చింది. జీఎస్‌డీపీ పరంగా ఏడో పెద్ద రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. పారిశ్రామిక రంగం ఫార్మా, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ భారీగా జీఎస్డీపీని అందిస్తున్నాయి. అదే సమయంలో టెక్స్‌టైల్స్, లెదర్, ఫుడ్ ప్రాసెసింగ్, మినరల్స్ వంటి సంప్రదాయ రంగాలు కూడా మంచి ప్రతిభను కనబరుస్తున్నాయని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఇక ఫార్మా రంగంలో తెలంగాణను లీడర్‌గా నీతి ఆయోగ్ తెలిపింది. దేశం ఫార్మా ఎగుమతుల్లో హైదరాబాద్ వాటా 20 శాతంగా ఉంది. తెలంగాణలో మౌలిక సదుపాయాలు కూడా ఎక్కువగా ఉన్నాయని .. సాధారణ టూరిజంతో పాటు మెడికల్ టూరిజం కూడా హైదారబాద్‌లో భారీగా వృద్ధి చెందుతోందని ప్రకటించారు.
ఆర్థికాభివృద్ధిలో నెంబర్ వన్
ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత తెలంగాణ జీఎస్‌డీపీ ఏడేళ్లలోనే రెట్టింపు అయింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో తెలంగాణ 18.5 శాతం అద్భుత ప్రగతి సాధిస్తోంది. జాతీయ స్థాయిలో ఇది 6.6శాతం మాత్రమే ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికి జీఎస్‌డీపీ 93.8 శాతం పెరిగింది. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానం. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4 శాతం ఉండగా ఏడేళ్లలో ఇది 5 శాతానికి పెరిగింది. తలసరి ఆదాయంలో తెలంగాణలో దేశంలోనే ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పుడు పదకొండో స్థానంలో ఉండేది.
అయిదు రెట్లు పెరిగిన ధాన్యం ఉత్పత్తి !
ధాన్యం ఉత్పత్తి ఏడేళ్లలో అయిదు రెట్లు పెరగింది. అంటే సాగునీటి లభ్యత పెరిగిందని అర్థం. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పెండింగ్‌లోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వంటి కార్యాచరణతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధి జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీడీపీలతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, నీటి పారుదల రంగాల్లో తెలంగాణ దేశ సగటుతో పోలిస్తే మెరుగైన అభివృద్దిని చూపిస్తోంది. తెలంగాణ అభివృద్ధిని కరోనా కూడా ఆపలేకపోయింది. కరోనా కారణంగా దేశ జీడీపీ 3 శాతం తగ్గగా తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2.4 శాతం పెరిగింది. విద్యుత్, మౌలిక సదుపాయాలు, ఐటీ రంగంలో పెట్టుబడులు పెరగడంతో ఇతర రంగాల్లోనూ మంచి అభివృద్ధి నమోదు అయింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికి కంటే విడిపోయిన తర్వాత తెలంగాణ అద్భుత ప్రగతి సాదిస్తోందని బంగారు తెలంగాణ దిశగా వెళ్తున్నామని.. దానికి అభివృద్ధే సూచిక అని ప్రభుత్వం చెబుతోంది.
కాళేశ్వరంతో సాగు నీరు - మిషన్ భగీరథతో తాగు నీరు !
అనితర సాధ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. కరువు కోరల్లో చిక్కుకున్న తెలంగాణను దేశపు ధాన్యాగారంగా మార్చామని టీఆర్ఎస్ ప్రకటించుకుంది. నల్లగొండ ఫ్లోరోసిస్ సమస్ తీరిపోయింది. పుట్టినప్పటి నుంచి జీవితాంతం మనిషి అవసరాలకు ప్రభుత్వపరంగా తోడ్పాటు అందించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన. ఆ నేపథ్యంలోనే జిల్లాల పునర్విభజన జరగడంతో పాలన ప్రజల వద్దకు వచ్చింది. భూ రికార్డుల ప్రక్షాళన వల్ల వివాదాలు తగ్గిపోయి, భూములకు భద్రత లభిస్తున్నది. విద్య, వైద్యం, పర్యావరణం వంటి ఏ రంగంలోనైనా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని తెలంగాణ సర్కార్ ప్రకటించుకుంది.