ప్రముఖ సింగర్ కేకే(కృష్ణకుమార్ కున్నత్) మృతి చెందిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి కోల్‌కతాలో ప్రదర్శన అనంతరం ఆయన గుండెపోటుతో కన్నుమూశారనే ప్రకటన మాత్రమే వచ్చింది. అయితే కేకే చివరిసారిగా ప్రదర్శన ఇచ్చే సమయంలో తీవ్ర ఇబ్బందికి లోనయ్యారు. కోల్‌కతా నజ్రుల్ మంచాలోని గురుదాస్ కాలేజ్ జరిగిన కాన్సెర్ట్ లో పాల్గొన్నారు కేకే. 


అయితే ఆ సమయంలో ఆయన చాలా ఇబ్బందికి లోనయ్యారు. ఓ క్లోజ్డ్ హాల్ లో కాన్సెర్ట్ జరిగింది. అక్కడ ఫ్యాన్, ఏసీ సదుపాయాలు లేకపోవడంతో కేకే చాలా ఇబ్బంది పడ్డారు. ఒకానొక సమయంలో చెమటలు భరించలేక కిందకు దిగి తన ముఖాన్ని తుడుచుకుంటూ.. నిర్వాహకులను స్వయంగా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారి స్పందించలేదు. దీంతో ఆయన ఇబ్బంది పడుతూనే ఉన్నారు. 


అలానే గంటపాటు ప్రదర్శనను పూర్తి చేశారు. ఆ తరువాత హోటల్ ఒబెరాయ్ గ్రాండ్ కు చేరుకొని ఛాతీ భాగంలో ఇబ్బందిగా ఉందని తన సిబ్బందికి చెప్పారు. అలా చెబుతూనే ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ఓ ప్రయివేట్ హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. గుండెపోటు కారణంగానే ఆయన మృతి చెందారని వైద్యులు చెబుతున్నారు. 


అయితే పోలీసులు మాత్రం అసహజ మరణం కిందే కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. కేకే చెమటలు పట్టిన ముఖాన్ని తుడుచుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు ఆయన మరణానికి నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని అంటున్నారు. అక్కడ ఏసీ లేదని.. వేడి కారణంగా కేకే ఇబ్బంది పడ్డారని.. డీహైడ్రేషన్‌ వల్లే స్ట్రోక్స్‌, కార్డియాక్ అరెస్ట్‌లు సంభవిస్తాయని కామెంట్స్ చేస్తున్నారు. ఆ కాన్సెర్ట్ లో కేకే పాల్గొనకపోతే ప్రాణాలతో ఉండేవారని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. నిర్వాహకుల లోపం వలనే కేకే ప్రాణాలు కోల్పోయారంటూ మండిపడుతున్నారు అభిమానులు.  


Also Read: కోటి రూపాయలు ఆఫర్ చేసినా పెళ్లిలో పాడలేదు - అదీ సింగర్ కేకే క‌మిట్‌మెంట్‌


Also Read: పెళ్లి చేసుకోబోతున్న పూర్ణ - ఆమెకు కాబోయే భర్త ఎవరంటే?