South African bowler Mondli Khumalo in serious condition after assault outside UK pub : ఇంగ్లాండ్‌ పబ్బుల వద్ద ఏం జరుగుతుందో తెలియడం లేదు! ఒక్కోసారి క్రికెటర్లే స్వయంగా గొడవ పడుతున్నారు. మరికొన్ని సార్లు క్రికెటర్లపై ఇతరులు దాడి చేస్తున్నారు. మొత్తానికి అక్కడ క్రికెటర్ల పరిస్థితి అర్థమవ్వడం లేదు. తాజాగా ఓ క్రికెటర్‌పై దాడి జరగడంతో అతడు కోమాలోకి వెళ్లాడు.


దక్షిణాఫ్రికా యువ పేసర్‌ మాండ్లి ఖుమాలోపై మే 28 రాత్రి కొందరు దుండగులు దాడి చేశారు. బ్రిస్టల్‌లోని ఓ పబ్‌ బయట దారుణంగా గాయపరిచారు. అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న నార్త్‌ పెథర్టన్‌ క్లబ్‌ గెలుపు వేడుకుల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. కోమాలోకి వెళ్లిన ఖుమాలో ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. గతంలో అతడు దక్షిణాఫ్రికా తరఫున అండర్‌-19 క్రికెట్లో ఆడాడు.


ప్రస్తుతం ఖుమాలో వయసు 20 సంవత్సరాలే. తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి దిగజారుతోందని వైద్యులు చెబుతున్నారు. డర్బన్‌లో నివసిస్తున్న అతడి మాతృమూర్తిని ఇంగ్లాండ్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతడికి హాని తలపెట్టాడని అనుమానిస్తున్న 27 ఏళ్ల కుర్రాడిని పోలీసులు అరెస్టు చేశారు.


అండర్‌-19 స్థాయిలో ఖుమాలో 2018లో ఇంగ్లాండ్‌పై రెండు టెస్టులు ఆడాడు. 10 వన్డే మ్యాచులు ఆడాడు. 2020 ప్రపంచకప్‌లోనూ నాలుగు ఆడాడు. నాలుగు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచులు, ఒక లిస్ట్‌ ఏ మ్యాచ్‌, నాలుగు టీ20లు ఆడాడు. ప్రతి టోర్నీలోనూ రాణించడం అతడికి అలవాటు.


కొన్నాళ్ల క్రితమే ఖుమాలో ఇంగ్లాండ్లోని నార్త్‌ పెథర్టన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సీజన్లో ఆ క్లబ్‌కు లీడింగ్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. 14.93 సగటుతో 15 వికెట్లు తీశాడు. ఏడు ఇన్నింగ్సుల్లో 191 పరుగులు సాధించాడు. అందులో రెండు హాఫ్‌ సెంచరీలు ఉండటం ప్రత్యేకం. ప్రస్తుతానికి ఖుమాలో వైద్య ఖర్చులను క్లబ్‌ భరిస్తోంది.  ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక మాత్రం ఆర్థిక వనరులను వెతుక్కోక తప్పదు. అందుకే నార్త్‌ పెథర్డన్‌ ఓ క్రౌడ్‌ ఫండింగ్‌ బిడ్‌ను మొదలు పెట్టింది.