Forest Officers Strike : తెలంగాణ ఫారెస్ట్ అధికారులు తమకు ఆయుధాలివ్వాలని ప్రభుత్వాన్ని డిేమాండ్ చేస్తున్నారు.  ఆయుధాలు ఇస్తేనే తాము విధులు నిర్వహిస్తామని ప్రకటించారు. గురువారం నుంచి విధుల బహిష్కరణకు పిలుపు ఇచ్చారు. పోలీసులకు ఇచ్చినట్లే ప్రభుత్వం తమకూ ఆయుధాలు ఇవ్వాలని చాలా కాలంగా అటవీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.  స్పష్టమైన హామీ ఇస్తేనే విధులకు హాజరు అవుతామని తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో ఎఫ్ఆర్వో శ్రీనివాసరావును హత్య చేయడంతో..తమకూ ప్రాణహాని ఉందని అటవీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. 


తెలంగాణలో అటవీ సిబ్బందిపై తరచూ దాడులు 
 
అటవీశాఖలో కింద స్థాయి నుంచి మొదటి ఉద్యోగం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లేదా ఫారెస్ట్ గార్డ్. ఒక బీట్ ఆఫీసర్ పరిధిలో సుమారు ఐదు వేల ఎకరాల అటవీ భూమి ఉంటుంది. దీని రక్షణ బాధ్యతంతా బీట్ ఆఫీసర్‌దే. విధి నిర్వహణలో వారికి ఎలాంటి వాహనంగానీ, ఆయుధంగానీ ఉండదు. అయితే అడవుల్లో కలప దొంగలు..  జంతువుల వేటగాళ్లు ఉంటారు. వారి బారి నుంచి  అడవిని కాపాడాలంటే.. అటవీ సిబ్బంది ఆయుధాల్లేకుండానే పోరాడాలి. పదునైనా ఆయుధాలతో ఉండే దొంగలతో .. ఆయుధాల్లేని అటవీ పోలీసులు పోరాడాలన్నమాట. అదే సమయంలో పోడు భూముల సమస్య తెలంగాణలో ఎక్కువగా ఉంది. భూముల్ని కాపాడాలంటే.. ఫారెస్ట్ సిబ్బంది.. పోడు వ్యవసాయం చేసే గిరిజనులతో తలపడాల్సి వస్తోంది. ఈ కారణంగా చాలా సార్లు ఘర్షణలు జరుగుతున్నాయి. 


గతంలో అటవీ సిబ్బందికి ఆయుధాలు !


1982 ముందు వరకు ఉమ్మడి ఏపీలో అటవీశాఖ అధికారులకు ఆయుధాలుండేవి. తర్వాత నక్సలైట్లు అటవీ సిబ్బంది ఆయుధాలను ఎత్తుకెళ్లిపోతుండడంతో, వారి దగ్గరున్న ఆయుధాలను సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఇచ్చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2013లో కొందరు సిబ్బంది చనిపోయిన తర్వాత ఆయుధాల కోసం అటవీ ఉన్నతాధికారులు ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఈ ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోయింది. 


అటవీ సిబ్బందికి ఆయుధాలిస్తే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని ప్రభుత్వ భావన !


ప్రస్తుతం స్మగ్లర్ల కన్నా ఎక్కువగా ఫారెస్ట్ అధికారులపై దాడులు..  పోడు భూముల వల్ల జరుగుతున్నాయి. పోడు భూములు సాగు చేసుకుని గుత్తికోయలు ఇప్పుడు కర్రలతోనే దాడులు జరుగుతున్నాయి. అటవీ ఉద్యోగుల వద్ద ఆయుధాలు వారూ ఎదురదాడికి దిగి మరిన్ని సమస్యలు తీసుకొచ్చే ప్రమాదం ఉందన్న ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో ఉంది.  దాడులు చేసేవారు వ్యవహరించే తీరు ఇంకా తీవ్రంగా ఉండే పరిస్థితి నెలకొంటుంది. కొందరు అటవీ అధికారులు కాల్పులు జరిపి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇలా భిన్నమైన అభిప్రాయాలతో అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వడంలో మాత్రం సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఆయుధాలుంటే మాత్రం దాడులు ఆగుతాయని నమ్మకం లేకపోవడమే దీనికి కారణం. 


ప్రభుత్వ చేతగానితనం ఓ అధికారి ప్రాణం తీసింది, శ్రీనివాసరావుది ప్రభుత్వ హత్యే- రేవంత్ రెడ్డి