Himanta Sarma on Rahul Gandhi:


ర్యాలీలో వ్యాఖ్యలు..


కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీపై...హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి హిమంత శర్మ బిస్వ కీలక వ్యాఖ్యలు చేశారు. "రాహుల్ గాంధీ గడ్డం పెంచుకుని అచ్చం ఇరాక్ మాజీ అధ్యక్షుడు నియంత సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నారు" అని అన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్‌లోని ఓ పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న హిమంత...ఈ వ్యాఖ్యలు చేశారు. "నేను ఈ మధ్యే గమనించాను. రాహుల్ గాంధీ రూపం అంతా మారిపోయింది. ఆయన అలా కొత్త లుక్‌లో కనిపించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ...అదేదో సర్దార్ వల్లబాయ్ పటేల్‌లాగానో, జవహర్ లాల్ నెహ్రూలానో మార్చుకుని ఉండాల్సింది. గాంధీజీలా కనిపించినా ఇంకా బాగుండేది. కానీ..ఆయన సద్దామ్ హుస్సేన్‌లాగా ఎందుకు కనిపించాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు" అని అన్నారు. కాంగ్రెస్ కల్చర్ ఎప్పుడూ భారత్‌కు సరిపోయే విధంగా ఉండదని, ఇండియాను ఏ మాత్రం అర్థం చేసుకోలేని వాళ్లతోనే కాంగ్రెస్ సన్నిహితంగా ఉంటుందని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. "ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు హిమంత శర్మ సిగ్గు పడాలి. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఇంత ఉన్నత స్థానంలో ఉన్నారంటే అదంతా రాహుల్ గాంధీ వల్లేనని గుర్తుంచుకోవాలి" అని మండిపడ్డారు. అసోం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ కుమార్ కూడా హిమంత శర్మపై మండి పడ్డారు.






"హిమంత శర్మకు హెడ్‌లైన్స్‌ ఉండాలనే కోరిక ఉన్నట్టుంది. రాహుల్ గాంధీని విమర్శిస్తేనే అది జరుగుతుందని ఆయనకు తెలుసు. ఆయన ఏమైనా మాట్లాడనివ్వండి. అధికారం కోసం ఎంతైనా దిగజారనివ్వండి. మేం మాత్రం అవేమీ ఖాతరు చేయం" అని అన్నారు. మరో కాంగ్రెస్ నేత మనీష్ తివారి కూడా హిమంత శర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "చౌకబారు వ్యాఖ్యలు" అంటూ మండి పడ్డారు. "దీనిపై స్పందించి ఆవ్యాఖ్యలకు అంత ప్రాధాన్యత ఇవ్వాలనుకోవడం లేదు. ప్రజల మధ్య ఉన్నప్పుడు మన భాషను అదుపులోకి పెట్టుకోవాలన్న ఒకేఒక కారణంతో ఏమీ మాట్లాడడం లేదు. ఆయన అలాంటి చౌకబారు కామెంట్స్ చేయడం చాలా దురదృష్టకరం" అని అన్నారు. 


రెండు విడతల్లో పోలింగ్..


గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. గుజరాత్ శాసనసభ పదవీకాలం 2023, ఫిబ్రవరి 18తో ముగియనుంది. డిసెంబర్ 1న గుజరాత్ తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 5న రెండో విడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న కౌంటింగ్, ఫలితాలు వెల్లడించనుంది. గుజరాత్‌లో ప్రస్తుతం భాజపా ప్రభుత్వం అధికారంలో ఉంది. గుజరాత్‌లో 182 శాసనసభ స్థానాలుండగా.. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 99 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 77 స్థానాలు సాధించింది. ఆ తర్వాత రాష్ట్రంలో పలుమార్లు ఉప ఎన్నికలు జరగడంతో ప్రస్తుతం కాషాయ పార్టీ బలం 111కు పెరిగింది.


Also Read: Asaduddin Owaisi On Modi: మోదీ సర్కార్‌ను నమ్ముకోవద్దు, పెళ్లి చేసుకోండి: ఒవైసీ