Hyderabad Cyber Crime News: ఆన్ లైన్ వేదికగా కార్యకలాపాలు పెరుగుతున్న వేళ మోసాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. సామాన్యులు, అధికారులు, సెలెబ్రిటీలు, ప్రముఖులు అనే తేడా లేకుండా అన్ని రంగాల వారు సైబర్ మోసాలకు బాధితులైన వారు ఉన్నారు. తాజాగా నటి, ఇటీవల బీజేపీలో చేరిన జీవిత రాజశేఖర్ (Jeevitha Rajashekhar) కూడా సైబర్ మోసాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. జియో రీచార్జ్ ఆఫర్‌ పేరుతో ఓ మోసగాడు జీవితా రాజశేఖర్ మేనేజర్‌ను బురిడీ కొట్టించాడు. 


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జీవితకు కొన్నాళ్ల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఫారూఖ్‌ అంటూ ఆ వ్యక్తి తనను తాను పరిచయం చేసుకున్నాడు. జీవిత (Jeevitha Rajashekhar) వాళ్ల ఇంట్లో ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ తానే ఇచ్చానంటూ మాటలు కలిపాడు. దీంతో అది నిజమే కాబోలు అని నమ్మి జీవిత తన మేనేజర్ తో మాట్లాడాలని సూచించింది. తాను బిజీగా ఉన్నానని, తన మేనేజర్ కు ఫోన్ చేయాలని చెప్పారు. 


దీంతో మేనేజర్ తో మాట్లాడిన ఆ కేటుగాడు తనకు ప్రమోషన్‌ వచ్చిందని ప్రస్తుతం జియోలో ఆఫర్లు ఉన్నాయని నమ్మబలకడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం జియోలో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పై మంచి ఆఫర్ ఉందని, తాను రిఫర్ చేసి మీకు 50 శాతం దాకా రాయితీ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. దానికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్‌ కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. దాదాపు ఎలక్ట్రానిక్ వస్తువులు రూ.2.5 లక్షల విలువ చేసేవి ఆ ఆఫర్ లో కేవలం రూ.1.25 లక్షలకే వస్తాయని నమ్మేలా చెప్పాడు. డబ్బు పంపిస్తే వస్తువులను డెలివరీ చేస్తానని చెప్పాడు.


దీంతో ఫారూక్ చెప్పిన మాటలు నిజమనుకుని జీవిత మేనేజర్ (Hyderabad Cyber Crime) నమ్మాడు. ఏకంగా రూ.1.25 లక్షలను సైబర్ నేరగాడి అకౌంట్ లోకి ట్రాన్స్‌ ఫర్‌ చేశాడు. ఆ తర్వాత వస్తువుల డెలివరీ ఎప్పుడు అవుతుందని అతనికి ఫోన్ చేస్తే ఎటువంటి స్పందన రాలేదు. అలా కొద్ది రోజుల తర్వాత ఫోన్ పూర్తిగా స్విఛ్చాఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లుగా గ్రహించిన అతను వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. 


ఫిర్యాదు అందుకొని విచారణ చేసిన పోలీసులు అతని ఫోన్, ఆన్ లైన్ అకౌంట్ ఆధారంగా దర్యాప్తు చేశారు. సైబర్ నేరానికి పాల్పడింది చెన్నై కి చెందిన టి.నాగేంద్ర బాబు అని తెలుసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా నాగేంద్ర కొంత మంది జూనియర్ ఆర్టిస్టులను, సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకొని పలు మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా యువ నిర్మాతలకు అవార్డులు ఇప్పిస్తానంటూ నమ్మించి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని పోలీసులు చెప్పారు. హైదరాబాద్ తో పాటుగా ఇతర కమిషనరేట్ల పరిధిలోనూ ఇతనిపై కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.